Mahadev Betting App: ఛత్తీస్‌గఢ్‌ సీఎం బఘేల్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Mahadev Betting App: ఛత్తీస్‌గఢ్‌ సీఎం బఘేల్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
వందలాది కోట్లు ఇచ్చినట్టు ఒప్పుకున్న యాప్‌ యజమాని

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ముడుపుల కేసులో ఛత్తీస్‌గఢ్‌ సీఎం, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. యాప్‌ యజమానిగా భావిస్తున్న శుభమ్‌ సోని నేరాన్ని ఒప్పుకోవడంతో బఘేల్‌ చిక్కుల్లో పడ్డారు. తనకు, బఘేల్‌కు ఉన్న సంబంధాల గురించి ఆయన వెల్లడించమే కాక, బఘేల్‌కు వందలాది కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చానని అంగీకరిస్తూ ఓ వీడియో బయటకు వచ్చింది . యూఏఈ వెళ్లిపొమ్మని భూపేశ్‌ బఘేలే తనకు సలహా ఇచ్చారని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో తాజా పరిణామాలు కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేశాయి.

ఛత్తీస్‌గడ్ ఎన్నికల ముంగిట్లో అక్కడ మహాదేవ్ యాప్ కేసు సంచలనం రేపుతున్నది. ఈ కేసులో సీఎం భుపేశ్ బఘేల్ పేరు కూడా వినిపించడంతో రాజకీయ దుమారం మొదలైంది. అసలే ఎన్నికల వేళ.. క్యాంపెయిన్ జోరుగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ లీడర్, సీఎం బఘేల్ పేరు రావడంతో రాష్ట్రాన్ని ఈ అంశం కుదిపేస్తున్నది. ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ అధికారాన్ని పొందుతామనే ధీమాలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ కేసు అశనిపాతంగా మారింది. రూ. 508 కోట్ల ముడుపులు సీఎం భుపేశ్ బఘేల్‌కు ఈ యాప్ ప్రమోటర్లు పంపించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పేర్కొనడంతో ఈ రాజకీయ దుమారం రేగింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన శుభ్‌మన్‌ సోని దుబాయ్‌ నుంచి వీడియో విడుదల చేశారు. అందులో సీఎం బఘేల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. బఘేలే తనను దుబాయ్‌ పారిపొమ్మని సలహా ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. తానే మహదేవ్‌ యాప్‌కు అసలైన యజమానినని, ఈ యాప్‌ ద్వారా వందలాది కోట్లను ఆర్జిస్తుండటంతో, చట్టపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాటి నుంచి రక్షణకు నేతలను ఆశ్రయించామని చెప్పారు. అందులో భాగంగానే బఘేల్‌కు పెద్దమొత్తంలో ముడుపులు అందజేసినట్టు తెలిపాడు.

శనివారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి భూపేశ్ బఘేల్‌కు రూ.500 కోట్ల అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి ఛత్తీస్‌గఢ్ సీఎం కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దుబాయ్‌తో మీకున్న ఒప్పందం ఏంటని? ఇంతవరకూ ఎవరినీ ఎందుకు అరెస్టులు చేయలేదు? అసలు యాప్‌ని ఎందుకు నిషేధించలేదని ఆయన నిలదీశారు. దీంతో ఆ మర్నాడే కేంద్రం ఆగమేఘాలపై యాప్‌ను నిషేధించడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story