MAHA POLITICS: అజిత్‌ పవార్‌ సహా 8 మందిపై అనర్హత పిటిషన్‌

MAHA POLITICS: అజిత్‌ పవార్‌ సహా 8 మందిపై అనర్హత పిటిషన్‌
అజిత్‌ పవార్‌పై అనర్హత పిటిషన్‌.. మరో ఎనిమిది మంది మంత్రులపై కూడా... శరద్‌ పవార్‌కు సోనియా ఫోన్‌....

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన NCP నేత అజిత్‌ పవార్‌, మంత్రులుగా ప్రమాణం చేసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ దాఖలైంది.పార్టీని వీడిన మొత్తం తొమ్మిది మంది నాయకులపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ వద్ద అనర్హత పిటిషన్‌ను దాఖలు చేశామని... వీలైనంత త్వరగా వారికి నోటీసులు పంపుతామని NCP నేత జయంత్ పాటిల్ తెలిపారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా వారు వ్యవహరించారని, పార్టీని వీడుతున్నట్లు తెలియజేయలేదని తాము కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశామని వెల్లడించారు. చాలా మంది ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని తాము విశ్వసిస్తున్నామని, వస్తే వారిని ఆహ్వానిస్తామని పాటిల్‌ తెలిపారు.


అంతకుముందు మహారాష్ట్రలో ప్రతిపక్ష నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. శరద్‌ పవార్‌కు పెద్ద షాక్‌ ఇస్తూ... ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్‌ నాయకుడు అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి NDAలో చేరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్‌ వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే NDA ప్రభుత్వంలో చేరామని అజిత్‌ చెప్పారు. ప్రభుత్వంలో చేరాలన్న నిర్ణయానికి పార్టీ ప్రజాప్రతినిధులందరూ మద్దతునిచ్చారని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఎన్సీపీ పేరుతో, ఎన్సీపీ గుర్తుపైనే పోటీ చేస్తామని అన్నారు. మహారాష్ట్రలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఇప్పుడు త్రిబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంగా మారిందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో అభివృద్ధి ఇక వేగం పుంజుకుటుందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 40 మంది తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులే స్పష్టం చేశారు.


పార్టీని ధిక్కరించి, ప్రభుత్వంలో చేరినవారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తేల్చిచెప్పారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలాంటివి చూడడం తనకు కొత్తేమీ కాదన్నారు. కొందరు నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడి ప్రభుత్వంలో చేరినట్లున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీని పునర్నిరి్మస్తానని శదర్‌ పవార్‌ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో త్వరలో జరిగే విపక్షాల సమావేశంలో తాను పాల్గొంటానని ఉద్ఘాటించారు.

మరోవైపు అజిత్‌ పవార్‌ పార్టీ మార్పు నేపథ్యంలో NCP అధినేత శరద్‌ పవార్‌కు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. . కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడి మద్దతు తెలిపారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారని, ఇక వారందరికీ క్లీన్‌ చిట్‌ వస్తుందని కాంగ్రెస్‌ విమర్శించింది.

Tags

Read MoreRead Less
Next Story