Odisha : కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని మీటర్ రీడింగ్ ఉద్యోగి హత్య

Odisha : కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని మీటర్ రీడింగ్ ఉద్యోగి హత్య
ఆయుధాలతో వెంబడించి మరీ చంపేసాడు

కరెంటు షాక్ కొడితే ప్రాణాలకే ప్రమాదం.. కానీ ఓ వ్యక్తి కరెంట్ బిల్లు రీడింగ్ తీసినందుకే ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో ఈ దారుణం జరిగింది. కరెంటు బిల్లు ఎక్కవ వచ్చిందని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఎవరిని ఏం అనాలో తెలియక మీటర్ రీడింగ్ ఉద్యోగిని దారుణంగా హత్య చేశాడు. తార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుపాటి గ్రామానికి చెందిన గోబింద సేతీ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

గ్యాలరీ గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ్‌ త్రిపాఠీ ఒక సాధారణ విద్యుత్‌ ఉద్యోగి. ఉద్యోగంలో భాగంగా కరెంట్​ మీటర్ల రీడింగ్‌ కోసం కుపాటికి వెళ్లాడు. అక్కడే కొంత మంది ఆగంతుకులు అతడ్ని వెంబడించారు. వారి నుంచి తప్పించుకున్న త్రిపాఠీ తరువాత ఓ ఇంటికి వెళ్లి మీటర్‌ రీడింగ్‌ తీస్తున్నాడు. అక్కడికి కూడా వచ్చారు ఆగంతుకులు. వారిలో ఒకరు తమకు ఎందుకు బిల్లు ఎక్కువగా వచ్చింది అని నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గోబింద సేతీ కోపంతో ఊగిపోయాడు. విచక్షణ కోల్పోయాడు. పదునైన ఆయుధంతో త్రిపాఠీపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ త్రిపాఠీ.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిందితుడు పరారయ్యాడు.


గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఘటనపై మీటర్ రీడర్ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. త్రిపాఠి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని, త్రిపాఠి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన కొద్ధి గంటలలోనే ఉద్యోగిని హత్య చేసిన గ్రామస్తుడు సేతీని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story