Manipur: కేసుల దర్యాప్తునకు 53 మంది సీబీఐ అధికారులు

Manipur: కేసుల దర్యాప్తునకు 53 మంది సీబీఐ అధికారులు
ఇద్దరు డీఐజీ స్థాయి మహిళా అధికారులతో కలిసి మొత్తం 29 మంది మహిళా అధికారులు

మణిపూర్ హింసాకాండ కేసుల విచారణకు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. వీరిలో ఇద్దరు మహిళా డీఐజీ స్థాయి అధికారులు ఒక పురుష డీఐజీ స్థాయి అధికారి, ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్నారు.

ఈశాన్య రాష్ట్రమైన మ‌ణిపూర్ లో గత కొంత కాలంగా చోటుచేసుకున్న హింసాకాండ, మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల‌కు సంబంధించి సీబీఐ విచార‌ణ‌ను ముమ్మ‌రం చేసింది. మ‌ణిపూర్ లో మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన రెండు ముఖ్య కేసులతో సహా ఇప్పటివరకు మొత్తం ఎనిమిది కేసులను నమోదు చేసింది. మరిన్ని కేసులను నమోదు చేసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులలో మహిళా అధికారుల పరిశీలన, పరిష్కారం తప్పనిసరి కావడంతో మొత్తం 53 మంది అధికారులలో 29 మంది మహిళలను నియమించింది. ముగ్గురు డిఐజిలు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ రాజ్‌వీర్‌లతో కూడిన బృందం మొత్తం దర్యాప్తును పర్యవేక్షించే జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు నివేదిస్తారని సీబీఐ తెలిపింది. ఇంత పెద్ద సంఖ్యలో మహిళా అధికారులు ఏకకాలంలో విచారణ చేయటం ఇదే మొదటిసారి. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు,ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీసులు అందరూ మహిళలే. ఈ సీబీఐ బృందంలో 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు. మణిపుర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించామని సీబీఐ అధికారులు తెలిపారు.సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం 1989లోని నిబంధనల ప్రకారం లోనివేనని తెలుస్తోంది.


మే 3 న మణిపూర్ హైకోర్టు రాష్ట్రంలో మెజారిటీ కమ్యూనిటీ అయిన మైతీల‌ను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తరువాత మే 3న మైతీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మంది చనిపోయారు. ఇక మే 4వతేదీన ఓ గుంపు మహిళల దుస్తులు విప్పి ప్రదర్శన జరిపిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.


Tags

Read MoreRead Less
Next Story