MANIPUR: మరోసారి రెచ్చిపోయిన అల్లరి మూకలు

MANIPUR: మరోసారి రెచ్చిపోయిన అల్లరి మూకలు
కాల్పుల్లో ముగ్గురి మృతి, మరింత అప్రమత్తం అయిన ప్రభుత్వం

4 నెలల నుంచి రక్తపాతంతో తడిసిపోతున్న మణిపుర్‌లో జాతుల మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఘర్షణల్లో ముగ్గురు యువకులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. అటు.. ఉద్యోగుల భద్రత దృష్ట్యా మణిపుర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులతో సహా మొత్తం 2 వేలమంది ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసింది.


మణిపుర్‌లో 4నెలల క్రితం జాతుల మధ్య చెలరేగిన తీవ్ర హింస ఇంకా సద్దుమనగలేదు. శుక్రవారం ఉఖ్రుల్‌ జిల్లాలోని కుకీ తొవాయి గ్రామంలో ముగ్గురు యువకులను ఓ సాయుధ మూక దారుణంగా హత్య చేసింది. ఉదయం ఆ గ్రామంలో భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి. తర్వాత అక్కడ వెళ్లిన భద్రతాబలగాలకు ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. వారంతా 24 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గలవారని పోలీసులు తెలిపారు. పదునైన కత్తులతో హత్య చేశారనీ చంపడానికి ముందు అవయవాలను నరికినట్లు పోలీసులు తెలిపారు.


మణిపుర్‌లో హింస ఇంకా చల్లారని నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. పోలీసులతో సహా మొత్తం 2వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసింది. సుప్రీంకు అందజేసిన నివేదికలో ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొంది. హింస నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల్లోని సిబ్బంది మధ్య కూడా అంతరాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వారిని ఆయా ప్రాంతాలకు బదిలీ చేశారు.కుకీ-జో ఆదివాసులు ఎక్కువ ఉన్న చురాచంద్‌పుర్‌, కాంగ్‌పోక్పి, చందేల్‌, తాంగ్నౌపాల్‌, ఫర్జాల్‌కు కలిపి ప్రత్యేక కార్యదర్శి, డీజీపీలను నియమించాలని ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల MLAలు ప్రధాని మోదీకి లేఖ రాశారు.ఇంఫాల్‌ లోయ సురక్షితం కాదనీ.. హైకోర్టు, సచివాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం అక్కడే ఉన్నందున.. తమకు ప్రత్యేక కార్యాలయాలు అవసరమని మైనారిటీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అప్పుడే తమ వర్గాల ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్‌లు, డ్రైవర్లు, ప్యూన్లు, సెక్యూరిటీ గార్డులు, స్కూల్‌ టీచర్లను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story