Manipur: దేశమంతా మణిపూర్ ప్రకంపనలు

Manipur: దేశమంతా మణిపూర్ ప్రకంపనలు
నిందితులను విడిచిపెట్టబోమని దేశ ప్రజలకు హామీ

మణిపూర్ మహిళల ఊరేగింపు ఘటనపై ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు ఈ అమానవీయ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఇలాంటి ఘటన ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. వర్గ కలహాల ప్రాంతంలో మహిళలను సాధనంగా ఉపయోగించడం రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత దారుణమని CJI జస్టిస్ చంద్రచూడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే తీసుకుంటామని హెచ్చరించారు. నేరస్థులను శిక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మణిపుర్‌ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మౌనం, చేతకానితనంవల్లే మణిపుర్‌లో అరాచకాలు జరుగుతున్నాయని ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఈ ఘటన సిగ్గుచేటని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో సహించకూడదని పేర్కొన్నారు.

మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటన్న ఆయన నేరస్థులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

మరోవైపు ఈ అంశం పై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌తో మాట్లాడారు. అమానవీయమని పేర్కొన్న ఇరానీ...ఈ అరాచకానికి పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని సీఎం చెప్పారని ట్వీట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మణిపుర్‌ సీఎం ట్వీట్ చేశారు. వైరల్ వీడియో పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతిభద్రతలు,ఇతర కారణాల దృష్ట్యా వీడియోలను తక్షణమే తొలగించాలని ట్విట్టర్‌ సహా ఇతర సామాజిక మాధ్యమ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story