Rajya Sabha: ముగిసిన 54 మంది సభ్యుల పదవీకాలం.

Rajya Sabha:  ముగిసిన 54 మంది సభ్యుల పదవీకాలం.
మన్మోహన్‌సింగ్‌ సహా..

దేశ వ్యాప్తంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న 54 మంది సభ్యుల పదవీకాలం మంగళవారం, బుధవారంతో ముగియనుంది. ఇక 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రిటైర్ అవుతున్నారు. దీంతో మన్మోహన్ స్థానంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభకు ఎంట్రీ ఇస్తున్నారు. బుధవారంతో మన్మోహన్ పదవీకాలం ముగియడంతో.. సోనియా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్.. సోనియాచే బుధవారం ప్రమాణం చేయించనున్నారు. బుధవారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు 10 మంది కొత్త సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక గురువారం మరికొంత మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేస్తారు.

ఆర్థిక రంగంలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్‌ సింగ్‌ 1991 అక్టోబర్‌లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సింగ్‌ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. ఏప్రిల్‌ 3న బుధవారం 91 ఏండ్ల మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో ఆ స్థానంలో తొలిసారి రాజస్థాన్‌ నుంచి సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు.

ప్రస్తుతం కేంద్రమంత్రులుగా కొనసాగుతున్న ఏడుగురి రాజ్యసభ పదవీ కాలం కూడా మంగళవారంతో ముగిసింది. వీరిలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవీమ, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్‌ రాణే, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ ఉన్నారు. పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పదవీ కాలం బుధవారంతో ముగియనున్నది. ఈ కేంద్ర మంత్రులందరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైష్ణవ్‌, మురుగన్‌లకు రాజ్యసభలో మరోసారి అవకాశం దక్కింది. మంగళవారం ఒక్క రోజే 49 మంది రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేయగా.. ఐదుగురు ఎంపీలు బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్‌ అవుతున్న వారిలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జయాబచ్చన్‌ కూడా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story