Haridwar: నింగికెగసిన సంద్రం

Haridwar: నింగికెగసిన సంద్రం
హరిద్వార్ ను కమ్మేసిన కారు మేఘాలు..

ప్రకృతి ని మనం అస్సులు అర్థం చేసుకోలేము. బయటకు అందంగా కనిపిస్తూనే మనకి ఏవో పాఠాలు చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ మనమే ఆ ప్రయత్నాలను అర్థం చేసుకోము. తాజాగా హరిద్వార్లో జరిగిన సంఘటన అలాంటిదే.

నిజానికి ఆకాశంలోని మేఘాలు మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాస్త మబ్బు పట్టి చినుకు పడితే ఒక అందం, సూర్యోదయంలో మేఘమాల ఒక అందం, సూర్యాస్తామయపు అందం మరొక చందం.. కానీ ఒక్కోసారి ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు భయపెడతాయి కూడా.సముద్రమే ఆకాశం నుంచి కిందపడుతోందా అన్నట్టు కనపడుతున్న ఈ మేఘాలు అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు ఆందోళనపరచాయి కూడా.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నల్లని మేఘాలతో హరిద్వార్ చీకటిగా మారిపోయింది. అయితే ఈ వాతావరణ పరిస్థితిని షెల్ఫ క్లౌడ్ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. షెల్ఫ్ క్లౌడ్ అనేది లోతట్టు, క్షితిజ సమాంతర మేఘాల నిర్మాణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. హరిద్వార్ లో కమ్ముకొచ్చిన మేఘాలను కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.


షెల్ఫ్ మేఘాలు ఒక రకమైన ఆర్కస్ క్లౌడ్ అని చెబుతారు. ఆర్కస్ క్లౌడ్స్ పలుచగా నేలకు దగ్గరగా ఉండే మేఘాలుగా చెప్పచు. అయితే వాటికి షెల్ఫ్ క్లౌడ్స్ తోడైతే అవి చూడటానికి ఆకట్టుకునే రూపంతో కనిపిస్తూ భయపెడతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రత్యేకమైన క్లౌడ్ ఫార్మేషన్‌లు తరచుగా ఉరుము లేదా క్యుములోనింబస్ క్లౌడ్ బేస్ నుంచి విస్తరిస్తాయని వారు పేర్కొన్నారు. షెల్ఫ్ మేఘాలు విధ్వంసక సుడిగాలులతో పాటు తీవ్రమైన తుఫానులతో సంబంధం కలిగి ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఇవి ఉరుములతో కూడిన తుఫానులను సృష్టించే అవకాశం ఉందని.. దీంతో పాటే వాతావరణంలో మార్పులకు సూచనగా చెప్పొచ్చని వారు చెప్పారు.

ఈ మేఘాలు భారీ తుఫాన్ కు కారణమయ్యే అవకాశం ఉండటంతో అధికారం యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. మరింత కట్టుదిట్టం అయిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story