Azharuddin: మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్

Azharuddin: మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్
హెచ్ సీఏను వదలని వివాదాలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. నిధుల గోల్మాల్ కారణంగా హెచ్ సి ఏ పై తాజాగా నాలుగు కేసులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. 2019-2022 మధ్య ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్లాది రూపాయల గోల్‌మాల్ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ హెచ్‌సీఏ సీఈవో సునీల్ ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అధ్యక్షుడిగా అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్‌మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, సంయుక్తకార్యదర్శిగా నరేశ్‌ శర్మ, కోశాధికారిగా సురేందర్‌ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ ఉన్నారు. దీంతో అజారుద్దీన్‌పై ఐపీసీ 406, 409, 420, 465, 467, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుల ప్రకారం సుమారు రూ.20 కోట్ల వరకూ కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. ఆ సమయంలో కొనుగోళ్ల కమిటీలో ఉన్న అజారుద్దీన్, జాన్ మనోజ్, విజయానంద్ లపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నెలకొన్న వివాదం ఇప్పటికే సుప్రీంకోర్టు కు చేరింది. కోర్టు కేసులు, వివాదాల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పరిస్థితుల్ని చక్కదిద్ది ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ...జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ సారథ్యంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరిగే వరకి హెచ్ సి ఏ పరిపాలనా వ్యవహారాలుచూసేందుకు సుప్రీంకోర్టు 14 ఫిబ్రవరి 2023న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కోర్టు ఆదేశాలతో హెచ్ సీఏ ప్రక్షాళనకు లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిటీ చర్యలు చేపట్టింది. ఆగస్టు నెలలో బహుళ క్లబ్ లతో హెచ్ సీఏను శాసిస్తున్న క్రికెట్ పెద్దలకు షాకిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్ లపై జస్టిస్ నాగేశ్వరరావు అనర్హత వేటు వేశారు. దీనికితోడు అక్టోబర్ నెలలో హెచ్ సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్ అజహరుద్దీన్ పై కమిటీ అనర్హత వేటు వేసింది. హెచ్ సి ఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్ పై అనర్హత వేటు పడింది. లావు నాగేశ్వరరావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. దీంతో రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో అజరుద్దీన్ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.


ఈ ఏడాది అక్టోబరు 20న హెచ్‌ఏసీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటల్లోపు హెచ్‌​సీఏ ఎన్నికల అధికారి ఫలితాలను ప్రకటించనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story