Mizoram: ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనలేం..

Mizoram: ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనలేం..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సిఎం నిర్ణయం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మిజోరం సీఎం లాల్‌దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఇవ్వటం లేదని, పాత కార్లే వాడుకోవాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మంత్రులు, వివిధ శాఖల ఉద్యోగులు నడుచుకోవాలని కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేల కార్లు కొనుగోలుకు నిధులు విడుదల చేయటం లేదు. కొత్త ప్రభుత్వంలోని మంత్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. పాత మంత్రులు వాడిన వాహనాల్నే కొత్త మంత్రులకు ఇస్తాం’ అని అన్నారు.

కొత్తగా ప్రభుత్వం ఎన్నికైతే.. ఆ రాష్ట్రంలో చాలా మార్పులను తీసుకువస్తూ ఉంటుంది. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా తమదైన ముద్రవేసేందుకు ప్రయత్నాలు చేస్తాయి. సంక్షేమ పధకాలు ఆపేసి , పేర్లు, లేబుళ్ళు మార్చేసే ఘనులు ఉన్నారు. ఇక సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. తాము ఉపయోగించే వాహనాలు, ఇళ్లను మార్చేస్తారు. అయితే తాజాగా ఆ రాష్ట్రంలో ఎన్నికైన సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ మిజోరం లో అలా జరగబోవటం లేదు. ఇటీవల జరిగిన మిజోరం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ అధికారాన్ని చేపట్టింది. కొత్త సీఎంగా ఆ పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే లాల్ దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు

కొత్తగా మళ్లీ కార్లు కొనుగోలు చేయడంతో ప్రజాధనం వృథా అవుతుందని మిజోరం సీఎం అభిప్రాయపడ్డారు. దీంతోపాటు గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు కల్పించిన సౌకర్యాలతో పోలిస్తే తాము దాదాపు 50 శాతం తగ్గించుకుంటామని లాల్ దుహోమా స్పష్టం చేశారు. ఇక మిజోరం ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. మిజోరంను అవినీతి రహితంగా మార్చాలని.. అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు పూర్తి స్థాయిలో కృషి చేయాలని లాల్ దుహోమా పిలుపునిచ్చారు. పసుపు, చెరకు, మిరప, వెదురు వంటి పంట ఉత్పత్తులను రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి.. కనీస మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అటు.. పంటలను ప్రభుత్వానికే విక్రయించాలన్న నిబంధనలను ఏమీ లేవని.. ప్రైవేటు వ్యక్తులెవరైనా ఎక్కువ ధర చెల్లిస్తే వారికైనా అమ్ముకోవచ్చని లాల్ దుహోమా స్పష్టం చేశారు. మరోవైపు.. మిజోరం రాష్ట్ర అభివృద్ధి కోసం 12 అంశాలను గుర్తించినట్లు చెప్పారు. వాటిని అమలు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ కమిటీలో ప్రభుత్వంతోపాటు గుర్తింపు పొందిన పార్టీ నాయకులు, ఎన్జీవోలు, మత సంఘాలకు, మిజోరం పీపుల్స్‌ ఫోరానికి చెందిన సభ్యులను కూడా భాగస్వాములు చేస్తామని చెప్పారు. పొదుపు చర్యలు, పెట్టుబడుల ఉపసంహరణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story