Music Maestro Rashid Khan: మ్యూజిక్ మ్యాస్ట్రో రషీద్ ఖాన్ కన్నుమూత

Music Maestro Rashid Khan: మ్యూజిక్ మ్యాస్ట్రో రషీద్ ఖాన్ కన్నుమూత
కేన్సరుతో 55 ఏళ్లకే కన్నుమూత

మ్యూజిక్‌ మ్యాస్ట్రోగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు ఉత్సాద్‌ రషీద్‌ ఖాన్‌ (55) కన్నుమూశారు.ప్రముఖ సంగీత విద్వాంసుడు,పద్మ అవార్డు గ్రహీత రషీద్ ఖాన్ గత కొంత కాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతూ కలకత్తాలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై, ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన్ని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించాం.. కానీ మా ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఈ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు ఆయన మరణించారు అని ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన అధికారి తెలిపారు. గత ఏడాది సెరిబ్రల్ అటాక్‌కు గురైనప్పటి నుంచి రషీద్ ఖాన్ ఆరోగ్యం క్షీణించింది.

ఉత్సాద్‌ రషీద్ ఖాన్ మరణం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ‘ఇది యావత్ దేశానికి, మొత్తం సంగీత సోదరులకు తీరని లోటు. రషీద్ ఖాన్ ఇక లేరని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బుధవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల సమయంలో గన్ సెల్యూట్, ప్రభుత్వ గౌరవం అందజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం మార్చురీలో ఉంచారు. అభిమానుల సందర్శనార్ధం బుధవారం రవీంద్ర సదన్‌కు ఆయన భౌతికకాయాన్ని తీసుకువెళ్లనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story