MOB ATTACK: గో మాంసం తరలిస్తున్నారని దాడి.. వ్యక్తి మృతి

MOB ATTACK: గో మాంసం తరలిస్తున్నారని దాడి.. వ్యక్తి మృతి
గోమాంసం తరలిస్తున్నారని గో రక్షకుల దాడి... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మహారాష్ట్రలో గో మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ వ్యక్తిని గో సంరక్షకులు కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ముంబైలోని కుర్లాకు చెందిన 32 ఏళ్ల అఫాన్ అన్సారీ, అతని స్నేహితుడు నాసిర్ షేక్‌ కారులో మాంసాన్ని తరలిస్తుండగా నాసిక్‌ జిల్లాలో గో సంరక్షకులు అడ్డుకున్నారు. కారులో మాంసాన్ని చూసిన ఆగ్రహంతో వారిద్దరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే కారు ధ్వంసమై ఉందని.... గాయపడిన ఇద్దరు వ్యక్తులను కారులో ఉన్నారని సబ్ ఇన్‌స్పెక్టర్ సునీల్ భామ్రే చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గాయపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు హత్య, అల్లర్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంతకీ వారు తరలిస్తున్నది గో మాంసమా కాదా అన్నది ల్యాబ్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే తేలుతుందని వెల్లడించారు. గో వధ నిషేధించే చట్టాన్ని అమలు చేసేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ఆమోదించింది. గోవులను అక్రమంగా తరలించే వాహనాన్ని సంబంధిత అధికారి స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. గో మాంసాన్ని రవాణా చేయడంపై నిషేధాన్ని బాంబే హైకోర్టు గతంలో సమర్థించింది. గోవుల అక్రమ రవాణా, గోవధ పశుసంరక్షణ చట్టం 1977 ప్రకారం నిషేధం. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఆరు నెలలు జైలు శిక్ష, రూ.వెయ్యి వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. గోవధకు పాల్పడినా, అందుకు సహకరించినా చట్టరీత్యా శిక్షార్హులే.

Tags

Read MoreRead Less
Next Story