Heart Attack: గంటపాటు ఆగిపోయిన గుండె.. చివరికి

Heart Attack: గంటపాటు ఆగిపోయిన గుండె.. చివరికి
అద్భుతం చేసిన వైద్యులు

గంటపాటు గుండె ఆగిపోయిన వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు నాగ్‌పూర్‌ వైద్యులు. అనంతరం 45 రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. పూర్తిగా కోలుకున్న ఆ వ్యక్తిని అక్టోబరు 13న ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ చేశారు. పేషెంట్‌కు అత్యవసరంగా వైద్యం అందించాల్సి రావడంతో సీపీఆర్‌ వివరాలు నమోదుచేయలేకపోయామన్నారు వైద్యులు. లేదంటే ఇదొక అరుదైన కేసుగా మిగిలిపోయేదని పేర్కొన్నారు వైద్యులు.

వైద్యులు తెలిపి వివరాలు ప్రకారం.. నాగ్ పూర్ కు చెందిన ఐటీ ఉద్యోగి ఆగస్టు 25న అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. అప్పటికి మూడు నాలుగు రోజులుగా అనేకసార్లు కళ్లు తిరిగి పడిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ పేషెంట్ కు డాక్టర్ రిషి లోహియా నేతృత్వంలోని వైద్యుల బృందం సీపీఆర్ చేసింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనల ప్రకారం.. 40 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా గుండె తిరిగి కొట్టుకోలేదంటే ఆ రోగి చనిపోయినట్లే.. అయితే, ఈ కేసులో 45 నిమిషాల పాటు సీపీఆర్ చేశామని, ఆ తర్వాత గుండె నెమ్మదిగా స్పందంచడం ప్రారంభించిందని డాక్టర్ లోహియా తెలిపారు.

ఎక్కువ సమయం సీపీఆర్ వల్ల పక్కటెముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. పదేపదే షాక్‌ల వలన చర్మం కాలిపోతుంది. కానీ, ఈ కేసులో బాధితుడికి అటువంటి దుష్ప్రభావాలు ఎదురుకాలేదని, సీపీఆర్ సరైన విధానంలో చేశామన్నారు. కాగా, ఐటీ కంపెనీలో పనిచేసే బాధితుడికి తొలుత మూడు నాలుగు రోజుల పాటు గుండెల్లో మంటలా వచ్చిందని, ఆగస్టు 25న అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడని వైద్యులు తెలిపారు. అతడు KIMS-కింగ్స్‌వే హాస్పిటల్‌కు చేరుకునేలోపు రెండుసార్లు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ఆస్పత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు.. దాదాపు గంటపాటు సీపీఆర్ చేసి, షాక్‌లు ఇచ్చి తిరిగి గుండెకొట్టుకునేలా చేశారు. అతడికి 40 రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్ అవసరం కాగా.. ఎనిమిదో రోజు తర్వాత అతడు స్పందించాడు. 45 రోజుల పాటు ఐసీయూలో ఉండి అద్భుతంగా కొలుకున్న ఆయన.. అక్టోబరు 13 ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story