Haryana : హర్యానా కొత్త సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం

Haryana : హర్యానా కొత్త సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం
హర్యానా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు..

ఎన్నికలు సమీపించిన వేళ హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఊహించని విధంగా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. దీంతో హర్యానాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. ఇంతకాలం జన్‌నాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)తో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు స్వతంత్రుల మద్దతుతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ హర్యానా అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా సైనీతో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కన్వర్‌ పాల్‌, మూల్‌చంద్‌ శర్మ, జైప్రకాశ్‌ దలాల్‌, బన్వరీలాల్‌, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్‌ సింగ్‌ చౌతాలా మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వానికి కేవలం ఏడు నెలల పదవీకాలమే ఉంది.

జననాయక్ జనతా పార్టీ, బీజేపీ మధ్య పొత్తు తెగిపోవడంతో.. మనోహర్ లాల్ కట్టర్ సీఎం పదవికి రిజైన్ చేశారు. దాంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్‌ సింగ్‌ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర నియోజకవర్గ ఎంపీగా.. హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ.. బీజేపీ, దాని మిత్రపక్షం జేజేపీ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వానికి ఖట్టర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అయితే మనోహర్ లాల్ ఖట్టర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 ఎమ్మెల్యేలు.. జననాయక్ జనతా పార్టీకి 10 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 30, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలో 10 స్థానాల్లో విజయం సాధించింది. జేజేపీ పరాజయం పాలైంది. పొత్తులో భాగంగా జేజేపీ పార్టీ రెండు ఎంపీ సీట్లు అడిగితే.. బీజేపీ ఒక్కటి మాత్రమే ఇచ్చేందుకు ఒప్పుకుంది. దీంతో జేజేపీ పార్టీ 10 స్థానాలకు క్యాండిడేట్లను అనౌన్స్ చేసింది. ఇక్కడే పొత్తు చెడిందని సమాచారం. ఆ తర్వాత ఖట్టర్ రిజైన్ చేసిన వెంటనే కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడం.. ప్రమాణస్వీకారం చేయడం.. బాధ్యతలు స్వీకరించడం కూడా చకచకా అయిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story