Diwali school holiday NY: ఇకపై న్యూయార్క్‌ లో దీపావళికి స్కూల్ సెలవు

రెండు దశాబ్దాలుగా దీపావళి సెలవు కోసం పోరాడుతున్న అసెంబ్లీ సభ్యురాలు

వెలుగులు నింపే దీపావళి పండగ భారతీయులకు ఎంతో ముఖ్యమైనది. ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో ఉన్న అందరూ ఆనందంగా చేసుకునే పండుగ దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండగను న్యూయార్క్ లో ఇకపై సెలవు రోజుగా ప్రకటించారు. ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది దీపావళి పండగ నుంచే ఈ సెలవును అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. న్యూయార్క్ సిటీ పరిధిలో ఉన్న అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు.

న్యూయార్క్‌‌లో నివాసం ఉండే సుమారు ఆరు లక్షలమంది దీపావళి పండుగను జరుపుకుంటారు. నగరంలోని స్కూల్ లకు దీపావళి రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటే న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనీఫర్ రాజ్ కుమార్ రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ బిల్లు సభ ఆమోదం పొందిందని వివరించారు. ఈ బిల్లు ఆమోదం పొందడాన్ని 60వ దశాబ్దంలో నల్లజాతీయులు పొందిన పౌర హక్కుల విజయాలతో సమానంగా అభివర్ణించారు మేయర్. గవర్నర్ ఈ బిల్లుపై తప్పక సంతకం చేస్తారని నమ్మకం ఉందన్న మేయర్ ఎరిక్ కాస్త త్వరగా చెబుతున్నప్పటికీ శుభ్ దీపావళి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. న్యూయార్క్ లో ఉన్న అన్ని మతాల ప్రజలు ఈ దేశపు పౌరులుగానే భావిస్తున్నామని వారందరి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఈ సంవత్సరం దీపావళి నవంబర్ 12 ఆదివారం పడడంతో వచ్చే సంవత్సరం నుంచి దీపావళి మొదటి అధికారిక సెలవు రోజుగా ఉండబోతోంది.

అమెరికాలో దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటారు. అక్కడి భారతీయులందరూ ఇండియాలో కొన్నట్టుగానే క్రాకర్స్ కొంటారు కానీ కాస్త తక్కువ మొత్తంలో. అయితే అక్కడ ఒక ప్రత్యేక సమయంలో మాత్రమే వాటిని కాల్చడానికి అనుమతి ఉంటుంది అది కూడా నివాసం ఉండే ప్రాంతాన్ని బట్టి. ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు దీపావళి సంబరాలు జరుగుతాయి. భారతదేశంలో జరుపుకున్నట్టే సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకున్న హిందువులు ఆరు బయట మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. ఒక్కొక్క కుటుంబంగా కాకుండా సుమారు ఐదు, ఆరు కుటుంబాలు ఒక దగ్గర చేరి దీపావళి సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రకటనతో స్థానిక హిందువు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story