బీహార్ : కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్‌

బీహార్ : కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్‌

బీహార్ సీఎంగా నితీష్‌ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజభవన్ లో నితీష్‌ చేత గవర్నర్ ఫగు చౌహాన్ గౌ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే వీరిలో బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు తార్ కిషోర్ ప్రసాద్, రేణుదేవి డిప్పూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన సుశీల్ మోదీ స్థానంలో తార్ కిషోర్ ప్రసాద్ ను ఈ పదవిలో తీసుకున్నారు. ఇక రేణుదేవి బీజేపీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఇందులో బీజేపీ 74, జేడీయూ 43, హిందూస్తానీ అవాం మోర్చా 4, వికాన్ శీల్ ఇన్సాన్ పార్టీ 4 స్థానాల్లో గెలిచాయి.

నితీశ్‌కు బిహార్ రాజకీయాల్లో చాణక్యుడు అని పేరు. ఏడోసారి బిహార్ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. 35 ఏళ్లుగా ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 1977లో పోటీ చేసి ఓడిన నితీశ్.. 1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీచేయలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎంగా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. అలాగని ఏ ఇతర ఎన్నికల్లో పోటీ చేయలేదని కాదు. ఆరుసార్లు లోక్‌సభ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, దానికే పరిమితం అవడం తనకు ఇష్టం లేదని చెప్పుకుంటూ ఉంటారు నితీశ్.

నితీశ్‌ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ఏడుసార్లు ప్రమాణం చేశారు. 2000 సంవత్సరంలో 8 రోజులు ఓసారి, మరోసారి 11 రోజులు, 2005, 2010, 2015లో రెండుసార్లు ప్రమాణం చేశారు. 1977 లో తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. తరువాత అదే స్థానం నుంచి 1985 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. చివరగా 2004 లో నలంద పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తొలిసారి 2000లో బిహార్‌ సీఎంగా ఎన్నికయినప్పటికీ ఎనిమిది రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 2005లో మరోసారి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం రావడంతో పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై.. బిహార్‌ను శాసిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story