Chandrayaan-3 : విక్రమ్ ,ప్రజ్ఞాన్ నుంచి సిగ్నల్స్ పై ఇస్రో లేటెస్ట్ అప్ డేట్

Chandrayaan-3 : విక్రమ్ ,ప్రజ్ఞాన్ నుంచి సిగ్నల్స్ పై ఇస్రో లేటెస్ట్ అప్ డేట్
స్లీప్ మోడ్ నుంచి బయటకు రాని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్

చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తిచేసి జాబిల్లి ఒడిలో నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లనుతిరిగి క్రియాశీలంగా మార్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. చంద్రుడిపై పగటి సమయం కావడంతో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ను మేల్కొలిపే ప్రయత్నం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇస్రో వెల్లడించింది. ల్యాండర్‌, రోవర్‌తో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. ఐతే ఇప్పటివరకు తమకు వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని వివరించింది. ల్యాండర్‌, రోవర్‌ను క్రియాశీలకంగా మార్చే ప్రయత్నాలు కొనసాగుతాయని ఇస్రో వెల్లడించింది.

నిజానికి ల్యాండర్‌, రోవర్‌ల జీవితకాలం 14 రోజులే ఇది జాబిల్లిపై ఒక పగలుకు సమానం. ఆ రెండింటితో పాటు వాటిలో పొందుపర్చిన పేలోడ్‌లు అత్యంత కీలక డేటాను ఇస్రోకు ఇప్పటికే చేరవేశాయి. ఆ తర్వాత సూర్యాస్తమయం కావడంతో రోవర్‌ను ఈ నెల 2న, ల్యాండర్‌ను 4న శాస్త్రవేత్తలు నిద్రాణ దశలోకి పంపారు. చందమామపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్‌ 120 నుంచి 200 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోవడం, అంతటి శీతల పరిస్థితుల్లో అవి పనిచేసే అవకాశాలు లేకపోవడమే అందుకు కారణం. ప్రస్తుతం ల్యాండర్‌, రోవర్‌ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో వాటిని నిద్ర నుంచి లేపి, కమ్యూనికేషన్‌ను పునఃస్థాపించుకునేందుకు ఇస్రో యత్నించింది. అదృష్టం బాగుండి ల్యాం డర్‌, రోవర్‌ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తే మరింత కీలక డేటా మన చేతికి అందుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.


కార్యాచరణ దశలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అనేక ప్రయోగాలను నిర్వహించాయి. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై 100 మీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేసింది. దక్షిణ ధ్రువం దగ్గర చంద్రుని ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని కనుగొంది. విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధ్రువ ప్రాంతంలోని చంద్రుడి ప్లాస్మా వాతావరణానికి సమీపంలో ఉన్న కొలతలు కూడా వేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అందుకుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై హాప్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది భవిష్యత్తులో చంద్రుని మిషన్లు , మానవ అన్వేషణకు ఓ భారీ విజయంగా భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story