పక్కింటిడాబాపై డబ్బులు విసిరేసాడు.. ఎందుకంటే

పక్కింటిడాబాపై డబ్బులు విసిరేసాడు.. ఎందుకంటే
విజిలెన్స్ దాడుల్లో పట్టుబడ్డ ఒడిస్సా నంబరంగపూర్ జిల్లా అడిషనల్ సబ్ కలెక్టర్

ఇప్పటివరకు డబ్బులు పారేసుకున్నారు అంటే డబ్బులు పోయాయి అనే అర్థం. కానీ ఇక్కడ ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ డబ్బులు పారేశాడు. అంటే పోయాయి అని కాదు డబ్బులు ఎక్కువయి పక్క డాబా మీదకు విసిరేసాడు. అయినా పాపం విజిలెన్స్ అధికారులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..

భువనేశ్వర్ నవరంగ్పూర్ లోని ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ అక్రమంగా చాలా ఆస్తులు కూడపెట్టాడు. సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో నిందితుడికి సంబంధించిన తొమ్మిది చోట్ల దాడులు చేశారు. ఇందులో వారికి కోట్లాది రూపాయల డబ్బు, బంగారం వెండి ఆభరణాలు, బంగారు బిస్కెట్లు లభించాయి. ఆస్తిని చూసి విజిలెన్స్ అధికారుల బృందం కూడా ఆశ్చర్యపోయింది. మొత్తం 3 కోట్ల రూపాయల నగదుని లెక్క పెట్టడానికి కౌంటింగ్ మిషన్లు కూడా కావాల్సి వచ్చాయి. భువనేశ్వర్ లోని కనక్ విహార్ లో ఉన్న ఆయన నివాసం లోపలికి వెళ్లడానికి అధికారులు 20 నిమిషాలు వేచి చూడవలసి వచ్చింది. ఈ సమయంలోనే అతడు హడావుడి గా డబ్బు పెట్టెలను పక్కింటి టెర్రస్ పైకి విసిరాడు, పాపం అనుకూలవతి అయిన అతని భార్య డబ్బు దాచమని పక్కింటి వారికి ఫోన్ చేసింది కానీ ఫలితం లేకపోయింది. పెట్టి నిండా 500 రూపాయల కట్టలు, వెండి, బంగారు ఆభరణాలతో అడ్డంగా అధికారులకు దొరికిపోయింది. మొత్తం రూ. 2.25 కోట్లు పైగా లెక్కల్లో చూపని డబ్బు లభ్యం అయ్యింది. ఇక భువనేశ్వర్ లోని ఓ ఇంట్లో ఆరు బాక్సులు నిండా నగదు, కొన్ని బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. నబరంగపూర్ నివాసంలో 89.5 లక్షలతో పాటు బంగారు ఆభరణాలు సీజ్ చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడ పెట్టారనే ఆరోపణలతో ప్రశాంత్ కుమార్ నివసించే ఇల్లు, కార్యాలయం, భద్రక్ జిల్లా బహుదరదా గ్రామంలోని అతని తల్లిదండ్రుల ఇల్లు, అతని పరిచయస్తుల ఇళ్ళు మొత్తం కలిపి 9 వేర్వేరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం ఈ కార్యక్రమంలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డిఎస్పీలు, ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

ఇతను గతంలో సుందర్ ఘాట్ విస్రా బ్లాక్ కి BDO గా ఉన్నప్పుడు కూడా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టు పడ్డాడు.

Tags

Read MoreRead Less
Next Story