Caste Survey: కుల గణన అధికారం మాదే

Caste Survey: కుల గణన అధికారం మాదే
సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌... సర్వే చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని స్పష్టీకరణ

బిహార్‌లో సీఎం నీతీశ్ ప్రభుత్వం తీసుకున్న కులగణన సర్వే(Bihar caste survey ) నిర్ణయాన్ని కేంద్రం(Union government ) వ్యతిరేకించింది. జనాభా గణన అనేది కేంద్రానికి సంబంధించిన అంశమని పేర్కొంటూ సుప్రీంకోర్టు( Supreme Court )లో అఫిడవిట్ దాఖలు చేసింది. జనగణన కేంద్ర జాబితాలోకి వస్తుందని.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ అధికారం ఉందని( Centre can conduct census) కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. జనాభా గణన చట్టబద్ధమైన ప్రక్రియ అని, జనాభా గణన చట్టం 1948 ప్రకారం దీన్ని చేపడతారని పేర్కొంది.


భారత రాజ్యాంగం( Constitution) ఏడవ షెడ్యూల్( Seventh Schedule) లోని కేంద్ర జాబితాలో దీన్ని చేర్చినట్లు తెలిపింది. రాజ్యాంగంలోని నిబంధనలు, వర్తించే చట్టానికి అనుగుణంగా దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. కులాల వారీగా జనాభా లెక్కించేందుకు బిహార్ కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. పట్నా హైకోర్టు ఇటీవల బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మరోవైపు బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన పూర్తయినట్లు ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ డేటా సంకలనం జరుగుతోందని అతి త్వరలోనే ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కులగణన సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనకరమని అన్నారు. ఎంతోకాలంగా నష్టపోయిన వారితో పాటు సమాజంలో ఆయా వర్గాల వారికి కూడా మేలు చేస్తుందని నితీశ్‌ కుమార్‌ తెలిపారు. పూర్తి డేటా వచ్చిన తర్వాత ఏయే అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందో స్పష్టంగా తెలుస్తుందని మిగిలిన రాష్ట్రాల్లో కూడా కులగణన జరిపితే బాగుంటుందని అన్నారు.


కొంతమంది కులగణనను వ్యతిరేకిస్తున్నారని కానీ అఖిలపక్షాల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వ్యతిరేకించే వారి అభిప్రాయం గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నారు. 2021లోనే పూర్తి కావాల్సిన కులగణన జాప్యం విషయమై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

ఈ కులగణన కార్యక్రమంలో జోక్యానికి అనుమతి కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇందులో ఉన్న చట్టపరమైన సమస్యలు తెలుపుతూ ఆగస్టు 28లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story