Operation Cheetah: చీతా మృతిపై దక్షిణాఫ్రికా ఆరా..?

Operation Cheetah: చీతా  మృతిపై దక్షిణాఫ్రికా ఆరా..?
కునో నేషనల్‌ పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతా మృతి చెందడంపై ఆ దేశ అటవీ, మత్య్స, పర్యావరణశాఖ స్పందించింది

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతా మృతి చెందడంపై ఆ దేశ అటవీ, మత్య్స, పర్యావరణశాఖ స్పందించింది. ఈ తరహా పరిణామాలు ఉంటాయని ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఊహించామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పెద్ద పెద్ద మాంసాహార జంతువులను ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడం, వాటిని అక్కడ పెంచడం చాలా సంక్లిస్టమైన విషయమని అధికారులు అన్నారు. అంతేకాకుండా కొన్ని జంతువులు కొత్త వాతావరణానికి అలవాటు పడలేవన్నారు. పరిసరాలు కూడా వాటిపై ప్రభావం చూపిస్తాయని... ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు

భారత్‌లో చీతాలు మృతి చెందడానికి గల కారణాల కోసం వేచి చూస్తున్నట్లు దక్షిణాఫ్రికా వెల్లడించింది. తాజాగా మృతి చెందిన చీతా పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు. అయితే, చీతాల మృతికి అంటువ్యాధులు కారణమై ఉండొచ్చన్నదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎఫ్‌ఎఫ్‌ఈ పేర్కొంది. ఫ్రీ ఎన్‌క్లోజర్లలోకి విడిచిపెట్టిన తర్వాత చితాలు కునో నేషనల్‌ పార్కు సరిహద్దులను దాటి వెళ్లిపోతున్నాయని, తిరిగి ఎలా లోపలికి రావాలో తెలియక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయన్నారు. ఇది కూడా వాటి మృతికి కారణమై ఉండొచ్చని దక్షిణాఫ్రికా అభిప్రాయపడింది. చీతాలు క్రమంగా ఆ ప్రాంతానికి అలవాటుపడి, ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మరో 11 చీతాలను వచ్చే 2 నెలల్లో ఫ్రీ ఎన్‌క్లోజర్లలోకి పంపాలని కునో నేషనల్‌ పార్కు అధికారులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story