EC: ఎన్నికల కమిషనర్ రాజీనామాపై విపక్షాల అనుమానాలు

EC: ఎన్నికల కమిషనర్ రాజీనామాపై విపక్షాల అనుమానాలు
మోదీతో విభేదాలే కారణమా అని ప్రశ్నలు.. ఈసీ ప్రైవేటీకరణ పూర్తయిందని ఎద్దేవా...

ఎన్నికల కమిషనర్ అరుణ్‌గోయెల్ రాజీనామాపై విపక్షాలు అనుమానం వ్యక్తంచేశాయి. కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు కారణమా.. మోదీ సర్కారుతో అభిప్రాయ భేదాలా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ గంగోపాధ్యాయలా ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేశారా అని నిలదీసింది. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కమిషనర్ రాజీనామాతో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఎన్నికల సంఘం భాజపా అనుబంధ విభాగంగా మారిందని ఉద్దవ్ వర్గ శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. గత 10ఏళ్లలో ఈసీ ప్రైవేటీకరణ అయిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల విషయంలో బీజేపీ పెద్దలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒత్తిడికి తలొగ్గకుండా రాజీనామా చేసిన అరుణ్‌ గోయల్‌కు శాల్యూట్ చేస్తున్నానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాజీనామాకు దారితీసిన కారణాలతో కేంద్రం ప్రకటన చేయాలని సీపీఎం డిమాండు చేసింది. ఎన్నికల వేళ ఆయన రాజీనామా అనుమానాస్పదంగా ఉందని శరద్ చంద్ర పవార్ ఎన్సీపీ పేర్కొంది. రాజీనామాకు అరుణ్ గోయెల్‌తో పాటు కేంద్రం సమాధానం చెప్పాలని MIM చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌ చేశారు.

మార్చి 15వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయగా.... సీనియారిటీపరంగా రెండోస్థానంలో ఉన్న కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరి 14నే పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. రెండు ఎన్నికల కమిషనర్ల పోస్టుల కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఐదుగురేసి పేర్లతో కూడిన రెండు ప్యానళ్లను తొలుత ఎంపిక చేయనుంది. అనంతరం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ ఛౌదరితో కూడిన సెలక్షన్ కమిటీ ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనుంది. వారిని రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లుగా నియమించనున్నారు. సభ్యుల వీలునుబట్టి ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. మార్చి 15లోగా ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదలకానున్న వేళ ఎన్నికల కమిషనర్ల నియామకం కీలకంగా మారింది.

గోయెల్‌ 2022 నవంబరు 1న ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం 2027 డిసెంబరు వరకూ ఉంది. ఇంతలో రాజీనామా చేశారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అయిన ఆయన ఇదివరకు కేంద్ర ప్రభుత్వంలో భారీ పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story