కొత్త పార్లమెంట్ ప్రారంభంపై రాజకీయ రగడ

కొత్త పార్లమెంట్  ప్రారంభంపై రాజకీయ రగడ
ప్రధాని మోదీ నూతన పార్లమెంట్‌ను ప్రారంభించడంపై దుమారం రేగుతోంది

కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా ప్రారంభంపై రాజకీయ రగడ రాజుకుంది. ప్రధాని మోదీ నూతన పార్లమెంట్‌ను ప్రారంభించడంపై దుమారం రేగుతోంది. ఈనెల 28న మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. ప్రధాని కాకుండా రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి సెంట్రల్ విస్టాను ప్రారంభించాలని కాంగ్రెస్, సీపీఐ, ఆప్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ మిగిలిన అన్ని విపక్ష పార్టీలతో చర్చించి ఉమ్మడి నిర్ణయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

మోదీ సర్కారు నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతిని పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా ప్రభుత్వం పదే పదే బాధ్యతలను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కొత్త పార్లమెంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి కోవింద్‌ను పిలువలేదని, ఇపుడు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదన్నారు. దేశంలో రాష్ట్రపతి మాత్రమే ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రతి పౌరునికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. రాష్ట్రపతి భారతదేశపు మొదటి పౌరురాలని ఖర్గే గుర్తుచేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఔచిత్యానికి, ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని ఖర్గే తెలిపారు.

పార్లమెంటు అంటే కేవలం ఒక నూతన భవంతి కాదని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియెన్ అన్నారు. పురాతన సంప్రదాయాలు, విలువలు, నిబంధనలు, పూర్వాచారాలతో ముడిపడిన సముదాయం, ప్రజాస్వామ్య పునాది అని.. అది ప్రధాని మోదీకి ఏమాత్రం అర్థం కాదని విమర్శించారు. ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం ద్వారా రాష్ట్రపతినే కాకుండా గిరిజనులను కేంద్రం అవమానిస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. నూతన భవన శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో రాష్ట్రపతిని విస్మరించడం తగదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.

అటు ప్రతిపక్ష ఆరోపణలకు బీజేపీ ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ఏది లేని చోట వివాదాలు రేకెత్తించడం కాంగ్రెస్‌కు అలవాటేనని కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్ పూరి ఆరోపించారు. రాష్ట్రపతి దేశాధినేతే అయినా ప్రభుత్వాధినేత ప్రధాని పార్లమెంట్‌కు నాయకత్వం వహిస్తారని గుర్తుచేశారు. ప్రధాని ఏ సభలోనైనా సభ్యుడిగా ఉంటారన్నారు. జాతీయ స్ఫూర్తి, దేశ పురోగతిపై గర్వించడమనేది కాంగ్రెస్‌కు కొరవడిందని విమర్శించారు. పార్లమెంటు అనుబంధ భవనాన్ని 1975 అక్టోబరు 24న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారని చెప్పారు. అలాగే 1987 ఆగస్టు 15న పార్లమెంటు గ్రంథాలయానికి రాజీవ్‌గాంధీ కూడా ప్రధానిగా శంకుస్థాపన చేశారని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వాధినేతలు చేయగా లేనిది ఇప్పుడు ప్రధాని మోదీ చేస్తే తప్పేంటని కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్ పూరి ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story