నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు?

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు?
నేటితో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశాలున్నాయి. మొదట అక్టోబరు 1వ తేదీ వరకూ కొనసాగాంచాలి అనుకున్నారు. అయితే, సభ్యుల్లో కొందరికి కరోనా..

నేటితో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశాలున్నాయి. మొదట అక్టోబరు 1వ తేదీ వరకూ కొనసాగాంచాలి అనుకున్నారు. అయితే, సభ్యుల్లో కొందరికి కరోనా వైరస్‌ సోకిన నేపథ్యంలో షెడ్యూలుకన్నా 8 రోజుల ముందే ఉభయ సభలను వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇవాళ అయిదు బిల్లులపై చర్చించిన తరువాత రాజ్యసభ, జీరో అవర్‌ చర్చ ముగిశాక సాయంత్రం లోక్‌సభ నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది.

వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి, 8 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు.. ఈ సమావేశాలు ముగిసేంత వరకూ సభను బహిష్కరించాయి. సస్పెన్షన్లు ఎత్తివేసేవరకు సభకు రాబోమని ప్రకటించాయి. లోక్‌సభలో విపక్షమూ వారికి సంఘీభావం ప్రకటించింది.

సభా కార్యకలాపాలను బహిష్కరించే నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు. విపక్షాలు చేసిన తప్పును విశాల హృదయంతో మన్నించాలని, సస్పెన్షన్లు ఎత్తివేయాల్సిందిగా వారి తరఫున తాను క్షమాపణలు కోరుతున్నానని రామ్‌గోపాల్‌ యాదవ్‌ చెప్పారు. సస్పెండైన ఎంపీలు తమ ప్రవర్తన పట్ల క్షమాపణలు కోరితేనే వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మం త్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, గహ్లోత్‌ స్పష్టంచేశారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లుపై రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. రైతులను పణంగా పెట్టి ఆశ్రిత పెట్టుబడిదారుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని 2014 ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని ట్విటర్‌ వేదికగా ఆయన విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story