Paytm: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో 15 రోజులు గడువు

Paytm: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో 15 రోజులు గడువు
ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం మరికొత సమయం..

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకి రిజర్వ్ బ్యాంకు మరో 15రోజుల గడువునిచ్చింది. ఫిబ్రవరి 29తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్ లలో డిపాజిట్లు, టాప్ -అప్ లు స్వీకరించొద్దని గతంలో ఆర్బీఐ ఆదేశాలు పేర్కొంది. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్ డ్రా చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పేటీఎం వ్యాలెట్ , పేమెంట్స్ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్ బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్ లో తేలినందునే పేటీఎంపై చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆర్ బీఐ అప్పట్లో వెల్లడించింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు వాడుతున్న వినియోగదారుల సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం మరికొత సమయం ఇవ్వాలని ఆర్‌బీఐ భావించింది. అయితే నిర్దేశించిన గడువులోగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నోడల్ ఖాతాల్లోని అన్ని ఆన్‌లైన్‌ లావాదేవీల సెటిల్‌మెంట్లను పూర్తి చేయాలని సూచించింది. గడువు తర్వాత ఎలాంటి లావాదేవీలకు అనుమతి ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ద్వారా ఫ్రీజ్ చేసిన ఖాతాలు మినహా అన్నిటిలో బ్యాలెన్స్ విత్‌డ్రా ప్రక్రియను సులభతరం చేయాలని కంపెనీని ఆర్బీఐ ఆదేశించింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆటోమెటిక్ ‘స్వీప్-ఇన్, స్వీప్ ఔట్’ సదుపాయం కింద పార్ట్‌నర్ బ్యాంకులతో కస్టమర్లకు సజావుగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిషేధం ఆకస్మిక నిర్ణయం కాదు. పేమెంట్స్ బ్యాంకుకు చెందిన కొన్ని ఖాతాల మధ్య అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా తెరిచేటప్పుడు కేవైసీ నియమాలు సరిగ్గా పాటించలేదని ఆర్బీఐ గుర్తించింది. అందువల్ల, లావాదేవీని గుర్తించడం కష్టం అవుతుంది. దీనిపై పలుమార్లు పేటీఎం బ్యాంకును ఆర్బీఐ హెచ్చరించింది. అయితే, పేటీఎం దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. చివరి ప్రయత్నంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపైనే ఆర్బీఐ ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story