Congress: ఈ ఎన్నికల్లో తక్కువ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్

Congress: ఈ ఎన్నికల్లో తక్కువ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్
పొత్తులు పెట్టుకున్నా పెరగని సీట్లు

దేశంలో కాంగ్రెస్‌ పోటీ చేసే లోక్‌సభ స్థానాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. 1996లో 529 స్థానాల్లో పోటీచేసిన హస్తం పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 329కే పరిమితమైంది. UPA కూటమిలో ఉన్నప్పటికీ 2019లో 421 సీట్లలో బరిలోకి దిగిన కాంగ్రెస్..ఈసారి ఇండియా కూటమిలో పార్టీలు పెరగడం వల్ల...తన సీట్లను బాగా కోల్పోయిది. కూటమిలో సర్దుబాట్లు సరిగా లేక వంద స్థానాల్లో ఇండియా పార్టీలు పరస్పరం తలపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికార NDAకి నేతృత్వం వహిస్తున్న భాజపా మాత్రం ఎక్కడా పరస్పర పోటీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. 446 స్థానాల్లో పోటీచేస్తున్న భాజపా మిత్రపక్షాలకు 97 సీట్లు మాత్రమే కేటాయించినప్పటికీ విభేదాలు లేకుండా పరిస్థితులను చక్కబెట్టుకుంది.

దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ మునుపెన్నడూ లేనంత తక్కువస్థానాల్లో పోటీ చేస్తోంది.ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 329 స్థానాలకే ఆ పార్టీ పరిమితం అయ్యింది.వాటిలో ఇప్పటివరకు 282 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో మూడు నియోజకవర్గాలు సహా ఇతర సీట్లకు.. ఇంకా ప్రకటించాల్సి ఉంది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీ 417 స్థానాల్లో పోటీ చేసింది. ఇన్నేళ్లూ అదే అత్యల్ప సంఖ్య కాగా, ఇప్పుడు అంతకంటే తక్కువ స్థానాలకు..పరిమితమవుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బలంగా ఉన్న ఎన్డీయేను ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో భావసారూప్య పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంది. కర్ణాటక, తెలంగాణ, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గోవా, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, సిక్కింతోపాటు. ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఆ పార్టీ పూర్తి స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో సీట్లు పంచుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ 80, మహారాష్ట్ర 48, బిహార్‌ 40,తమిళనాడులో 39 కలుపుకొని..ఈ రాష్ట్రాల్లో మొత్తం 207 స్థానాలు ఉండగా వాటిలో కాంగ్రెస్‌ కేవలం 52 చోట్ల పోటీ చేస్తోంది. అంటే 25.12శాతం స్థానాలకే పరిమితమైంది. మిగిలినవాటిని.. ఇండియా కూటమి మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ శివసేన-UBT, NCP పవార్‌, DMKకు వదులుకుంది. 21 సీట్లున్న ఒడిశాలో ఇప్పటివరకు 17 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.మిగతా నాలుగింటిని JMM,వామపక్షాలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌, హరియాణాల్లో ఆప్‌తో సీట్ల సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్‌పంజాబ్‌లో మాత్రం అదే పార్టీతో తలపడుతోంది. పశ్చిమ బెంగాల్‌........, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలో వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుంది. కానీ కేరళలో లెఫ్ట్‌ కూటమితో హోరాహోరీ తలపడుతోంది.

కాంగ్రెస్‌ ప్రస్తుతం కేరళ, తెలంగాణ, కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర పంజాబ్‌ల్లో మాత్రమే భాజపాకు బలమైన పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది. యూపీ....., బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లో హస్తం పార్టీ., ఇండియా కూటమి పక్షాలు అంత గొప్ప స్థితిలో లేవని.... విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 25 స్థానాల్లో కాంగ్రెస్‌ బలహీనంగా ఉందనే భావన వ్యక్తమవుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో పోటీ...భాజపా, అక్కడి ప్రాంతీయ పార్టీలకు మధ్యే ఉందని స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఉనికి పెద్దగా లేదు. ఫలితంగా..329 సీట్లలో పోటీ చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్‌ ప్రభావం కొన్ని రాష్ట్రాలకే పరిమితమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story