కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటుతుంది : ప్రధాని మోదీ

కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటుతుంది : ప్రధాని మోదీ
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించారు. కరోనా పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 2వేల ల్యాబ్‌లు పని చేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే..

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించారు. కరోనా పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 2వేల ల్యాబ్‌లు పని చేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటుతుందని చెప్పారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది సేవాభావంతో పని చేస్తున్నారని అభినందించారు. భారత్‌లో ప్రతీ 10లక్షల మందిలో 5500 మందికి కరోనా సోకిందని మోదీ తెలిపారు. అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో 10 లక్షల మందిలో 25వేల మందికి పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. ప్రపంచం అంతా వ్యాక్సిన్‌ కోసం యుద్ధప్రాతిపదికన పని చేస్తోందని, శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు. కొన్ని వ్యాక్సిన్లు రెండో దశలో, మరికొన్ని మూడో దశ ప్రయోగాల్లో ఉన్నట్టు చెప్పారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత.... ప్రతీ ఒక్కరికి చేరే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

పండుగల సీజన్‌ సమీపిస్తున్న వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ కీలక సూచనలు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిందనే ఆలోచనతో నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పారు. దేశం నుంచి కరోనా విడిచిపోయిందనే భావన రానీయొద్దుని... కరోనా తగ్గిందని భావిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కరోనా తగ్గిందని అనుకుని... మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టేనని అన్నారు. అగ్నిని, శత్రువును, వ్యాధిని తక్కువచేసి చూడొద్దని... వ్యాధికి మందు లభించే వరకు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు.

నిర్లక్ష్యానికి సంపన్న దేశాలు కూడా మూల్యం చెల్లించాయని మోదీ అన్నారు. మన జాగ్రత్తలు, సంప్రదాయాలే మహమ్మారి ప్రభావం తగ్గించాయని తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేవరకు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కరోనా కట్టడికి కంకణబద్ధులై ప్రజలంతా ముందడుగు వేయాలని సూచించారు. నవరాత్రులు, దసరా, దీపావళి వేళ అందరూ అప్రమత్తమై ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ... దేశ ప్రజలకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Read MoreRead Less
Next Story