PM MODI: "ఇండియా" పేరుతో ప్రజల్ని మోసం చేయలేరు..!

PM MODI: ఇండియా  పేరుతో ప్రజల్ని మోసం చేయలేరు..!
ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు.... ఈస్టిండియా కంపెనీలోనూ ఇండియా అనే పదం ఉందని మండిపాటు... ప్రతిపక్షాలకు దిశ లేదన్న మోదీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపడానికి ఏకమైన ఇండియా ఫ్రంట్‌(opposition alliance INDIA )పై ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi‌) తొలిసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడంపై ప్రధాని విరుచుకుపడ్డారు. దేశం పేరు ఇండియాను ఉపయోగించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఎంపీలు తమ నిరసనలతో పార్లమెంట్ కార్యకాలపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పార్లమెంటరీ సమావేశంలో( BJP Parliamentary Party meeting) ప్రధాని మోదీ ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్‌ పై విమర్శనాస్త్రాలు సంధించారు.


ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌(Indian Mujahideen), నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, బ్రిటీష్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీ( East India Company) పేరులోనూ ఇండియా పేరు ఉందని మోదీ గుర్తు చేశారు. ఒక లక్ష్యం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను( directionless opposition in the country) తాను ఇంతవరకు చూడలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. విపక్ష నేతలు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని అన్నారు.

2024లోనూ ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఆ పార్టీలు నిర్ణయించుకున్నాయని ఎద్దేవా చేశారు. వాటి ప్రవర్తన చూస్తే ఆ విషయం అర్థం అవుతుందని మోదీ అన్నారు. ఓటమి, నిస్సహాయత, ఒకే పాయింట్ ఎజెండాతో ప్రతిపక్షాలు ఓ దిశ లేకుండా పయనిస్తున్నాయని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో భాజపానే సునాయసంగా అధికారం చేపడతామని ప్రధాని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


ఈసారి కూడా ఆగస్టు 15న హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించేందుకు భాజపా పార్లమెంటరీ పార్టీ నేడు సమావేశం కాగా అందులో ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ... అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై నేతలు చర్చించారు. భాజపా సంస్థాగత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు కమలం పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story