9 ఏళ్ల పనులను 9 నెలల్లో వివరించండి: ప్రధాని మోదీ

9 ఏళ్ల పనులను 9 నెలల్లో వివరించండి: ప్రధాని మోదీ
ప్రధాని అధ్యక్షతన 5 గంటలపాటు కేబినేట్‌ భేటీ.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మోదీ దిశా నిర్దేశం..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రివర్గ సహచరులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. 9 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అన్నిపనులను 9 నెలల్లో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా విజయం కోసం కృషి చేయాలని హితోపదేశం చేశారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ సభా మందిరంలో ప్రధాని మోదీ నేతృత్వంలో దాదాపు ఐదు గంటలపాటు కేంద్ర కేబినెట్ భేటీ ఫలప్రదంగా సాగింది. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అంశాలపై మంత్రిమండలితో చర్చించామని సమావేశం అనంతరం ప్రధాని ట్వీట్‌ చేశారు. 2047 నాటికి ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చేలా శక్తివంచన లేకుండా పని చేయాలని కేంద్ర మంత్రులకు సూచించారు. వేగంగా అభివృద్ధి చెందేందుకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలన్నారు. యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నిలదొక్కుకునేలా బలంగా ఉండాలని సూచించారు.


ఈ సమావేశంలో మోదీ తొమ్మిదేళ్ల పాలన, రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ఈ కీలక చర్చ జరిగింది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాల్సిన బిల్లులపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని భారత్‌ సాధించిన అభివృద్ధిని మోదీ గుర్తు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పాత భవనంలోనే జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ అభివృద్ధి ఎలా ఉండాలన్న దానిపై మార్గసూచన ప్రదర్శించారు. 2047 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఎలాంటి శక్తిగా ఎదుగుతుందన్న దానిపై ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రజంటేషన్‌ ఇచ్చారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి కూడా ప్రధాని మోదీ విదేశీ పర్యటన అంశాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి ఎలా పెరుగుతుందో చెప్పారు.


అయితే అందరూ ఊహించినట్లు ఈ సమావేశంలో మంత్రివర్గ మార్పుపై చర్చ జరగలేదు. చర్చంతా ప్రభుత్వ పనితీరు, భవిష్యత్‌ వ్యూహాలపైనే కొనసాగింది. అయితే వర్షాకాల సమావేశాలకు ముందే క్యాబినేట్‌ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఉంది. ఎన్డీఏలో కొత్తగా చేరిన శివసేన శిందే వర్గం, ఎన్సీపీ నేతలను మంత్రివర్గంలో చేర్చుకుని కూటమి విస్తరించడం ఖాయమని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story