అతి పొడవైన టన్నెల్‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ

అతి పొడవైన టన్నెల్‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో రవాణా రంగ చరిత్ర ఓ కొత్త అధ్యాయానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌ వద్ద మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరుతో నిర్మించిన ఈ టన్నెలను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు ప్రధాని మోదీ. అనంతరం గ్యాలరీని పరిశీలించారు. ఈ వ్యూహాత్మక సొరంగం వల్ల మనాలి-లేహ్ మధ్య 475 కిలోమీటర్ల దూరం 46 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీని వల్ల దాదాపు నాలుగున్నర గంటల సమయం ఆదా అవుతుంది. మొత్తం 9.02 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గానికి అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీనిని నిర్మించారు. ఈ అటల్‌ టన్నెల్‌ను 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మించారు.

ఈ అటల్‌ టన్నెల్‌ సముద్ర మట్టానికి 10 వేల 213 అడుగుల ఎత్తున ఉంది. గుర్రపు నాడా ఆకారంలో 8మీటర్ల వెడల్పు, 5.525 మీటర్ల ఎత్తులో నిర్మించారు. చిన్న సంఘటన జరిగినా పసిగట్టే సాంకేతిక వ్యవస్థలను కూడా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీని లోపల రెండు వరుసల రహదారిని ఏర్పాటు చేశారు. ప్రతి 60 మీటర్లకు ఒక అగ్నిమాపక వ్యవస్థ, ప్రతి 150 మీటర్లకు ఓ టెలిఫోన్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి 500 మీటర్ల వద్ద అత్యవసర ద్వారం కూడా నిర్మించారు. ప్రతి 2.2 కిలోమీటర్ల వద్ద గుహలు, వాయు కాలుష్యంపై ప్రతి కిలోమీటరు వద్ద హెచ్చరికలు చేసే వ్యవస్థను ఏర్పాటుచేశారు.

ఇందులో రోజుకి 3 వేల కార్లు, 1,500 ట్రక్కులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అలాగే, అత్యవసర సమయంలో సమాచారం ఇవ్వడానికి ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి 250 మీటర్లకు ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్‌ సిస్టం సీసీటీవీ కెమెరాలు, కిలోమీటరుకు గాలి నాణ్యతను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి. అలాగే, ప్రతి 25 మీటర్లకు టెన్నెల్ నుంచి బయటికి వెళ్లేందుకు దారి చూపే సూచీలు, లైటింగ్ వ్యవస్థను అమర్చారు. టన్నెల్‌లో వెలుతురు కోసం సెమీ ట్రాన్స్‌ఫర్‌ వెంటిలేషన్‌ సిస్టం ఉంది. మొత్తం 3,500 కోట్లు ఖర్చుతో నిర్మించిన ఈ సొరంగ మార్గం నిర్మాణం... పదేళ్లపాటు సాగింది. ఈ టన్నెల్‌ను 2002 మే 26న శంకుస్థాపన చేసి, ఆరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటికి ఇది అందుబాటులోకి వచ్చింది.

అటల్‌ సొరంగం ముఖ్యంగా భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం సరఫరా చేసేందుకు ఉపయోగపడుతోంది. ఇది సైనికంగా వ్యూహాత్మక మార్గంగానే గాక... పర్యాటక ప్రాంతంగానూ ప్రసిద్ధి చెందనుంది. అలాగే హిమాచల్‌, లద్దాఖ్‌లలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కోట్ల రూపాయల రవాణా ఖర్చు ఆదా అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story