Narendra Modi: భయపడేవాడు మోదీనే కాదు

Narendra Modi: భయపడేవాడు మోదీనే కాదు
చత్తీస్‌గఢ్‌లో మార్పు గాలి వీస్తోందన్న మోదీ

ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చత్తీస్‌గఢ్‌లో అవినీతి ప్రభుత్వాన్ని బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తాను దేనికీ భయపడే వాడిని కాదని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఛత్తీస్‌గఢ్ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయబోనని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో రూ.7,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భయపడేవాడు మోదీయే కాదని చెప్పారు. కాంగ్రెస్ ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ, తాను ఛత్తీస్‌గఢ్ సంక్షేమానికి చర్యలు చేపట్టడంలో వెనుకంజ వేయబోనని



చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు తాము పెట్టామని చెప్పారు. పేదలకు కాంగ్రెస్ శత్రువు అని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఆ గాలి వీస్తోందని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధిని ఓ పంజా అడ్డుకుంటోందని, ఇది కాంగ్రెస్ పంజా అని, ప్రజల హక్కులను లాక్కుంటోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుని, నాశనం చేయాలని ఈ పంజా సంకల్పించిందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ సమక్షంలోనే మోదీ ఈ ఆరోపణలు చేశారు.

ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ప్రజల జీవితాలు మెరుగుపడతాయని మోదీ తెలిపారు. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో సదుపాయాలు, అభివృద్ధి ప్రస్థానం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అంటాగఢ్-రాయ్‌పూర్ మధ్య నడిచే కొత్త రైలును మోదీ వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులకు కార్డుల పంపిణీని ప్రారంభించారు.




ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తూ, బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడినవారికి చికిత్స చేయించడానికి సహాయపడతామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story