PM Modi: వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం

PM Modi: వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం
సార్వత్రిక ఎన్నికల్లో 400కుపైగా స్థానాలను దక్కించుకుంటుందన్న ప్రధాని

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కుపైగా స్థానాలను దక్కించుకుంటుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. భాజపాకే 370కుపైగా స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశానికి మంచి ప్రతిపక్షం అవసరమని కానీ కాంగ్రెస్ ఆ పాత్రను సమర్థంగా పోషించడంలో ఘోరంగా విఫలమైందనిప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయాయని దీర్ఘకాలం ప్రతిపక్ష పీఠంపై కూర్చోవాలని నిర్ణయించుకున్నాయని మోదీ అన్నారు.

దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాల దుస్థితికి కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన కారణమని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఇతర గొంతులు వినపడేలా చేయలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రసంగించిన మోదీ విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రగతి వేగాన్ని వివరించిందన్నారు. కాంగ్రెస్ "రద్దు" సంస్కృతిలో చిక్కుకుందని దేశం సాధించిన ప్రతి విజయాన్ని రద్దు చేయాలని చూస్తోందని మోదీ అన్నారు. కాంగ్రెస్‌ దుకాణం మూసివేత అంచున ఉందన్న ప్రధాని రాహుల్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ఓ ఉత్పత్తిని మళ్లీ మళ్లీ ప్రారంభించే ప్రయత్నంలో కాంగ్రెస్‌ పతనం అంచుకు చేరిందని మోదీ విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల్లో నిర్మాణాత్మక సూచనలు చేసే అవకాశం ప్రతిపక్ష పార్టీలకు వచ్చిందని కానీ వారు దానిని వదులుకున్నారని మోదీ అన్నారు. దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ భ్రమల్లో ఉంచాలని చూసిందని కానీ అది జరగలేదని తెలిపారు. మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని పార్లమెంట్‌ వేదికగా ప్రధాని ప్రకటించారు. మూడోసారి అధికారంలోకి రాగానే NDA పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని రాబోయే వెయ్యేళ్లకు పునాది వేస్తుందని మోదీ తెలిపారు. వంశ పారంపర్య రాజకీయాలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తోందన్న ప్రధాని ఈ ధాటికి కొందరు ప్రతిపక్ష నేతలు తమ పార్లమెంటు స్థానాలను మార్చుకోవాలని, మరికొందరు రాజ్యసభకు వెళ్లాలని యోచిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల సంవత్సరంలో కాస్త కష్టపడి ప్రజలకు మంచి సందేశం ఇచ్చే అవకాశం విపక్షాలకు వచ్చిందని దానిని కూడా చేజార్చుకున్నారని ప్రధాని ఎద్దేవా చేశారు

Tags

Read MoreRead Less
Next Story