PM Modi: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం

PM Modi:  అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం
ఆ చారిత్రక సందర్భం ఎప్పుడంటే?

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మాణమౌతున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, నృపేంద్ర మిశ్రా, మరో ఇద్దరు ప్రధానిని ఢిల్లీలో కలిసి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించారు.

విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారు అయింది. వెయ్యేళ్లు అయినా సరే.. చెక్కు చెదరని.. ప్రపంచంలోనే అత్యద్భుతమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది. భక్తుల ఆశలకు.. ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం పూర్తి అయ్యింది. ఈక్రమంలోనే.. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని… అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది.


హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. ఇవాళ ఎన్నో భావోద్వేగాలతో కూడిన రోజు అని పేర్కొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు తనను కలిసేందుకు తన ఇంటికి వచ్చారని చెప్పారు. శ్రీ రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా తనను ఆహ్వానించినట్లు తెలిపారు. రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని.. తన జీవిత కాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం తన అదృష్టమని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

రాంలాలా ప్రతిష్ట ఎప్పుడంటే..

2024 జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి అయోధ్యలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి తర్వాత రామలల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి.. 10 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించినట్లు చెప్పారు. ఇక మూడంతస్తుల్లో నిర్మిస్తున్న అయోధ్య రామాలయ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్‌ నృపేంద్ర మిశ్రా ఇటీవల తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story