BIDEN-MODI MEET: బైడెన్‌తో మోదీ కీలక చర్చలు

BIDEN-MODI MEET: బైడెన్‌తో మోదీ కీలక చర్చలు
కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు.... ప్రపంచ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సంయుక్త ప్రకటన...

భారత్‌-అమెరికా మధ్యనున్న స్నేహబంధం ఇకపైనా ప్రపంచ మానవాళికి మేలు చేయడంలో గొప్ప భూమిక పోషిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. G-20 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు తొలిసారిగా భారత్‌కు వచ్చిన బైడెన్‌తో మోదీ- లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. G-20కి భారత్‌ సారథ్యం, అణు ఇంధన రంగ సహకారం, 6G, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలు, అంతర్జాతీయ బ్యాంకుల పునర్నిర్మాణం వంటి అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చాయి. ప్రపంచ సంక్షేమం కోసం భారత్‌ - అమెరికా బంధం కొనసాగుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. బైడెన్‌ భారత్‌లో అడుగుపెడుతూనే "హలో దిల్లీ! G-20 కోసం భారత్‌కు రావడం గర్వంగా ఉంది" అని ట్వీట్‌ చేశారు.


చంద్రయాన్‌-3, ఆదిత్య మిషన్‌ విజయాన్ని అభినందించిన బైడెన్‌.. భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తామని వెల్లడించారు. బైడెన్‌ను తన నివాసానికి స్వాగతం పలకడం ఎంతో ఆనందదాయకమని మోదీ అన్నారు. అత్యంత ఫలప్రదంగా భేటీ జరిగిందని తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, ప్రజల నడుమ బంధాలను మున్ముందుకు తీసుకువెళ్లేలా అనేక అంశాలు చర్చకు వచ్చాయని ప్రధాని అన్నారు. దాదాపు 50 నిమిషాలసేపు కొనసాగిన భేటీ అనంతరం నేతల సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది.


G-20కి భారత్‌ సారథ్యం, అణు ఇంధన రంగ సహకారం, 6G, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలు, అంతర్జాతీయ బ్యాంకుల పునర్నిర్మాణం వంటి అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చాయి. గ్రహ శకలాల నుంచి భూగోళాన్ని, అంతరిక్ష ఆస్తులను పరిరక్షించుకోవడంలో సమన్వయాన్ని పెంచుకోనున్నట్లు సంయుక్త ప్రకటన తెలిపింది. 5G, 6G సాంకేతికతల అభివృద్ధిపైనా నేతలు చర్చించుకున్నారు. అమెరికా నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్, భారత బయోటెక్నాలజీ విభాగం మధ్య బయోటెక్నాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆవిష్కరణల్లో సహకారానికి ఒప్పందం కుదిరింది. తమ దేశానికి చెందిన జనరల్‌ ఆటోమిక్స్‌ నుంచి MQ-9B రకం డ్రోన్లు 31 కొనుగోలు చేసేందుకు భారత రక్షణ శాఖ లేఖ అందజేయడాన్ని బైడెన్‌ స్వాగతించారు. సాంకేతికత బదలాయింపు ద్వారా G.E.F-414 జెట్‌ ఇంజిన్లను GE ఏరోస్పేస్, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఉత్పత్తి చేయాలన్న వాణిజ్య ఒప్పందాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి తమ కట్టుబాటును ఇద్దరూ పునరుద్ఘాటించారు.

G-20 కూటమి ముఖ్యమైన ఫలితాలను ఇవ్వడంలో భారత్‌ సారథ్యం దోహదపడుతోందని బైడెన్‌ ప్రశంసించారు. ఉమ్మడి లక్ష్యాల పురోగతికి శిఖరాగ్ర సదస్సు ఫలితాలు ఆలంబనగా నిలుస్తాయని మోదీ, బైడెన్‌ ఆశాభావం వెలిబుచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story