గుర్రానికి గంజాయి తాగించిన యజమాని

గుర్రానికి గంజాయి తాగించిన యజమాని
కేదార్ నాధ్ జంతు హింస

ఒక్కోసారి మనిషి, మనిషి కాదు మృగమేమో అనిపిస్తుంది. మృగం కంటే హీనం అని అనిపించే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఒక మనిషి మూగజీవం పట్ల ఘోరంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరాఖండ్లో వెలుగు చూసింది. కేదార్నాథ్ నడక మార్గంలో గుర్రానికి సిగరెట్లలో డ్రగ్స్ కలిపి బలవంతంగా ముక్కు ద్వారా ఎక్కిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు.

కేదార్‌నాథ్ ఆలయం వద్దకు వెళ్లాలంటే అందరూ నడవలేరు కాబట్టి కింది నుంచి యాత్రికులను, వస్తువులను పర్వతాలు ఎక్కించేందుకు జంతువులను ఉపయోగిస్తారు. వాహనాల ద్వారా గౌరీకుండ్ అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి 18 km ఎత్తు పైకి వెళ్లేందుకు కాలినడక లేదా గుర్రాలకు మాత్రమే అవకాశం ఉంది. తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి. అయితే ఆ మంచు కొండల్లో జంతువులు హింసకు గురవుతున్నాయి. గుర్రాలు ఏమాత్రం అలసటగా కనపడినా, నీరసపడిపోయినా వాటిని కర్రలు, రాడ్లతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ వాటిని హుషారు ఎత్తించే పేరుతో చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. గుర్రాలు, గాడిదలకు గాయాలైనా పట్టించుకోకుండా వాటి పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు. దెబ్బలు తిన్న తరువాత కూడా ఆ జీవి ఉత్సాహంగా ప్రయాణం చేయటం కోసం వాటికి బలవంతంగా యజమానులు గంజాయి సిగరెట్లు తాగిస్తున్నారు. ఇద్దరు గుర్రాల నిర్వాహకులు గుర్రం నోట్లో గంజాయి పెట్టడం, తర్వాత దాని నోరు ముక్కు ముయ్యటం, కాసేపు ఉక్కిరిబిక్కిరి అయిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. .

కేదార్‌నాథ్ లో మొత్తం 2, 3 నెలల పని మాత్రమే ఉంటుంది. అందుకే కేదార్‌నాథ్ క్షేత్రంలో 2500 జంతువులకు అనుమతి ఉంటే.. కేవలం 1400 జంతువులతోనే పని చేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల గాడిదలు, గుర్రాల శక్తికి మించి 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. వాటి సామర్థ్యం పెంచేందుకు మత్తు మందులు ఇస్తారు కానీ దానివల్ల జంతువుల అంతర్గత అవయవాలు దెబ్బతిని అనారోగ్యం పాలవుతాయి అన్న విషయాలు వారు పట్టించుకోరు. కేదార్‌నాథ్ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఈ చర్యలపై జంతు ప్రేమికులు, జంతు సంరక్షణ సంస్థలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నోరు లేని మూగ జీవాలను హింసిస్తున్నారని మండిపడుతున్నారు.

వైరల్ అయిన ఈ వీడియోలపై పీపుల్ ఫర్ యానిమల్ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలంటూ సంబంధిత మంత్రిత్వ శాఖకు తక్క్షణం లేఖ రాశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Tags

Read MoreRead Less
Next Story