NIA RAIDS: ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసులో ఎన్‌ఐఏ దూకుడు

బీజేపీ నేత ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసులో ఎన్‌ఐఏ ముమ్మర దర్యాప్తు.. ముగ్గురు నిందితుల ఇళ్లలో సోదాలు.. కీలక ఆధారాలు స్వాధీనం

కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన బీజేపీ యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ హత్య కేసులో పరారీలో ఉన్న ముగ్గురి ఇళ్లల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. కొడగు జిల్లాలోని అబ్దుల్ నాసిర్, అబ్దుల్ రెహమాన్, దక్షిణ కన్నడ జిల్లాలోని నౌషాద్‌ల ఇళ్లలో NIA సోదాలు చేసి ఎలక్ట్రానిక్ పరికరాలను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. పర్వీన్ నెట్టారు హత్య కేసు దుండగులకు.. ఈ ముగ్గురు నిందితులు కర్నాటక, తమిళనాడులోని రహస్య స్థావరాలలో ఆశ్రయం కల్పించినట్లు NIA అనుమానిస్తోంది.


ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసులో పరారీలో ఉన్న వారితో సహా మొత్తం 21 మంది వ్యక్తులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, IPC, సహా ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి NIA ఛార్జిషీట్ చేసింది. 2022 జులై 26న మంగళూరులోని పుత్తూరు - సుల్లియా రోడ్డులోప్రవీణ్ నెట్టారు హత్యకు గురయ్యారు. ప్రవీణ్ నెట్టారుపై బహిరంగంగానే మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య తర్వాత మంగళూరు, సుళ్య ప్రాంతంలో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్రలో భాగంగానే ప్రవీణ్ నెట్టారును హత్య చేశారని ఎన్ఐఏ చార్జ్ షీట్‌లో పేర్కొంది.

సమాజంలో భయాందోళనలు సృష్టించేందుకు..2047 నాటికి ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే లక్ష్యంతోనే ఈ హత్య చేశారని చార్జ్ షీట్‌లో పేర్కొంది. తన లక్ష్యాల కోసం పీఎఫ్‌ఐ సర్వీస్ టీమ్స్, కిల్లర్ స్క్వాడ్స్ అనే రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్టుగా చార్జ్‌షీట్‌లో పేర్కొంది. NIA చార్జ్ షీట్ లో 20 మందిని పేర్కొనగా.. అందులో ఆరుగురు పీఎఫ్‌ఐ సభ్యులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నవారిలో.. ముస్తఫా పైచార్, మసూద్ కెఏ, కొడాజె మహమ్మద్ షెరీఫ్, అబూబక్కర్ సిద్దిక్, ఉమ్మర్ ఫరూక్ ఎంఆర్, తుఫైల్ ఎంహెచ్ ఉన్నారు. వీరిలో ఎవరిని పట్టించినా 5 లక్షల రివార్డ్ ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. ప్రవీణ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు బెళ్లారె బూడు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. ప్రవీణ్‌ హత్యకు కేరళలో కుట్ర జరిగిందని.. బెళ్లారెలో కేరళ యువకుని హత్యకు ప్రతీకారంగా ప్రవీణ్‌ను హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన బైకు కేరళ రిజిస్ట్రేషన్‌దని తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story