ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. జంట మృత్యువాత

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. జంట మృత్యువాత
ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఏకమై ఏడడుగులు వేయాలనుకున్నారు. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రేమ జంట పెళ్లికి..

ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఏకమై ఏడడుగులు వేయాలనుకున్నారు. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రేమ జంట పెళ్లికి నవంబర్ 22న సుముహూర్తం నిశ్చయమైంది. కొత్త జీవితంలోకి అడుగు పెట్టేలోపు కొన్ని మధురానుభూతులను జ్ఞాపకాల రూపంలో పదిలపరుచుకోవాలనుకున్నారు. కానీ.. ఆ జ్ఞాపకాలే వారి జీవితానికి చేదు జ్ఞాపకాలుగా, చివరి స్మృతులుగా మిగిలిపోతాయని ఆ కొత్త జంట కలలో కూడా ఊహించలేదు.

కర్ణాటకలోని మైసూరుకు చెందిన చంద్రు, శశికళ జీవితాలను ప్రీ వెడ్డింగ్ ఫొటో‌షూట్ తలకిందులు చేసింది. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో భాగంగా.. కావేరి నదిలో బోటుపై ఫొటోలకు ఫోజులిస్తుండగా ప్రమాదవశాత్తూ ఆ బోటు నీటిలో బోల్తా పడింది. ఫొటోగ్రాఫర్ స్టిల్స్ తీస్తుండగానే ఈ ఘటన జరిగింది. అప్రమత్తమై చంద్రు, శశికళను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చూస్తుండగానే.. వారి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి.

సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న చంద్రు వయసు 28 సంవత్సరాలు కాగా, శశికళ వయసు 20 సంవత్సరాలు. నవంబర్ 22న మైసూరులో అంగరంగ వైభవంగా చంద్రు, శశికళ కల్యాణం చేయాలనుకున్నామని.. ఇంతలోనే ఈ ఘటన తీరని శోకాన్ని మిగిల్చిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బోటులో నది ఒడ్డుకు సుమారు 30 మీటర్ల లోపలకు వెళ్లి.. ఫొటోకు ఫోజిచ్చినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. వధువు కాళ్లకు హై హీల్డ్ శాండల్స్ తొడుక్కోవడంతో బోటుపై నిల్చునే క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయిందని, ఆమెను కాపాడే క్రమంలో వరుడు చంద్రు కూడా నీటిలో పడిపోయాడని.. సాయంత్రం 4.30 గంటల సమయంలో వారి మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story