TS Election: తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపు

TS Election: తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపు
..రాహుల్, ప్రియాంక ట్వీట్, ..

తెలంగాణ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.తెలుగులో ట్వీట్ చేస్తు ప్రధాని మోదీ తెలంగాణ ఓటర్లకు కీలక సూచనలు చేశారు. రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని సూచించారు. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

మోడీ తెలుగు ట్వీట్ : తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.

అటు రాహుల్ ప్రియాంక కూడా ట్వీట్లు చేశారు.

రాహుల్ ట్వీట్...

‘‘నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదరసోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

ప్రియాంక గాంధీ ట్వీట్..

‘‘నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా.. పిల్లలారా. మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు. అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు. జై తెలంగాణ. జై హింద్’’ అంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పండుగ కొనసాగుతుంది. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 119అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల పోలింగ్ లో 2,290మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా తేల్చనున్నారు. ఇక ఈ రోజు ఎన్నికలపోలింగ్ నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు టెన్షన్ నెలకొంది. ఓటరు దేవుళ్ళ తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అన్నది అందరిలోనూ ఆందోళనకు కారణంగా మారింది. ఇదిలా ఉంటే ఎన్నికల పండుగ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ చేసేలా ప్రజలను ఆకట్టుకునేందుకు మోడల్ పోలింగ్ స్టేషన్లను బాగా అందంగా అలంకరించి మరీ ఏర్పాటు చేశారు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. అయితే అధికారులు, ప్రభుత్వాలు ఈసారి ఎన్నికలలో ఓటింగ్ పెంచాలని శత విధాలా ప్రయత్నం చేశాయి. ఎన్నికల సంఘం స్వీప్ ద్వారా ఓటరు అవగాహనా కార్యక్రమాలు పెట్టి మరీ ఓటుహక్కు ప్రాధాన్యతను స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అవుతుందని అంతా భావిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story