Ayodhya Ram Mandir: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ

Ayodhya Ram Mandir: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
84 సెకన్ల పాటు మోడీ చేతులమీదుగా కొనసాగిన ప్రాణ ప్రతిష్ఠ క్రతువు

కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. రామభక్తులు వందల ఏళ్లుగా ఎదురుచూసిన అపురూప క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. జన్మభూమిలో జగదభిరాముడు కొలువుదీరాడు. దివ్యముహూర్తాన ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఏడు వేల దేశ, విదేశీ అతిథులు ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించి తన్మయత్వానికి గురయ్యారు.

శ్రీరామజన్మభూమి అయోధ్యలో . చారిత్రక ఘట్ట ఆవిష్కృతమైంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా సాగింది. దిల్లీ నుంచి అయోధ్య వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులతో శ్రీరాముని భవ్యమందిరానికి చేరుకున్నారు. రాముడికి ప్రత్యేక వస్త్రాలను తీసుకుని వచ్చి పండితులకు సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా మోదీ వ్యవహరించారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ పక్కనే RSS అధినేత మోహన్ భగవత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశీనులై పూజల్లో పాల్గొన్నారు.


తర్వాత గర్భగుడిలో రామ్‌ లల్లా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట క్రతువును చేపట్టారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య పూజాదికాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్‌ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ వేడుకను నిర్వహించారు. పండితుల సమక్షంలో 51అంగుళాల ఎత్తైన రామ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాముడికి ప్రధాని మోదీ పుష్పాలు, నైవేద్యం.... సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత గర్భగుడిలో ప్రధాని మోదీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. స్వామి వారికి తొలి హారతిని ఇచ్చారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం శ్రీరాముడికి ప్రధాని హారతి ఇచ్చారు. విల్లు, బాణం ధరించి, బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించిన బాలరాముడిని చూసి భక్తకోటి పులకరించింది. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగడంతో ప్రధాని మోదీ సహా అతిథులు, ప్రజలు తన్మయత్వం చెందారు.

25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు ప్రాణప్రతిష్ట క్రతువు ముగిసే వరకూ మంగళ వాయిద్యాలు మోగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన14 జంటలు కర్తలుగా వ్యవహరించారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్ప వర్షం కురిపించారు. ఆలయం ప్రాగణం వెలుపల ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆశీనులైన దేశ,విదేశీ అతిథులు ఈ ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని LED తెరలపై వీక్షించారు. దేశ,విదేశాల్లో లక్షల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి జయజయ ధ్వానాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story