SC: కోర్టులోని కేసులపై సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలా..

SC: కోర్టులోని కేసులపై సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలా..
కోర్టు పరిధిలోని కేసులపై తప్పుడు వ్యాఖ్యానాలపై విస్మయం... సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపణ

కోర్టు పరిధిలోని కేసులపై సామాజిక మాధ్యమ వేదికల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలా చేయడం న్యాయస్థానాల అధికారాన్ని తగ్గించడమేనని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛముసుగులో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించింది. విమర్శలు, నిందలను ఎదుర్కొనే విశాల హృదయం న్యాయస్థానానికి ఉన్నా,. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏకంగా న్యాయ ప్రక్రియలోనే జోక్యం చేసుకోవడం తీవ్రమైన విషయమని పేర్కొంది. కేసులో ఓ పక్షానికి అనుకూల లేదా వ్యతిరేక తీర్పు రావడం సహజమన్న సుప్రీం... కోర్టు ప్రొసీడింగ్స్‌పై వాస్తవాలను వక్రీకరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. అసోంలో ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన కేసును గతంలో విచారించిన సుప్రీం..తీర్పును రిజర్వు చేసింది. తీర్పు వెలువడక ముందే ఆయన.. ఫేస్‌బుక్‌లో తనకు అనుకూల తీర్పు వచ్చిందని ప్రకటన చేశారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం.. కోర్టుధిక్కరణ చర్యలు చేపట్టింది

న్యాయపరిశీలనకు సంబంధించిన విషయాలపై సందేశాలు, వ్యాఖ్యలు, కథనాలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం తీర్పు కోసం రిజర్వ్ చేసిన కేసుకు సంబంధించి ఫేస్‌బుక్ పోస్ట్‌ను తప్పుదారి పట్టించినందుకు అస్సాం ఎమ్మెల్యే కరీం ఉద్దీన్ బర్భూయాపై ధిక్కార చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. 'ఇటీవల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా దుర్వినియోగం చేయడం తీవ్రమైన ఆందోళన కలిగించేదిగా ఉంది. న్యాయస్థానాలు నిందలు, విమర్శలను భరించేంత విశాలత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాలకు సంబంధించిన వ్యాఖ్యలు, పోస్ట్‌లు వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తీకరణ హక్కు ముసుగులో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా న్యాయస్థానాల అధికారాన్ని అణగదొక్కడం లేదా న్యాయానికి అంతరాయం కలిగించే ధోరణిని కలిగి ఉండటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని' ధర్మాసనం పేర్కొంది. న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏ పక్షానికైనా అనుకూలంగా, కొన్నిసార్లు వ్యతిరేకంగా వ్యవహరించడం చాలా సాధారణమని అత్యున్నంత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Tags

Read MoreRead Less
Next Story