Puducherry: నా రాజీనామాకు కులతత్వం, లింగవివక్షే కారణం..

Puducherry: నా రాజీనామాకు కులతత్వం, లింగవివక్షే కారణం..
పుదుచ్చేరి ఏకైక మహిళా ఎమ్మెల్యే, మంత్రి రాజీనామా

పుదుచ్చేరిలో ఏకైక మహిళా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నెలకొల్పి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ చండీరా ప్రియంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. అంతే కాదు తన రాజీనామా అనంతరం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కులతత్వం, లింగ వివక్ష, ధనబలం రాజకీయాలు అంటూ పార్టీపై , రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రాష్ట్రంలో ఏఐఎన్ఆర్‌సీ-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ప్రియాంగ తన రాజీనామా లేఖను తన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంలో అందజేశారు. మంత్రి ప్రియాంగ రాజీనామాపై వ్యాఖ్యానించడానికి ముఖ్యమంత్రి ఎన్ రంగసామి నిరాకరించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చండీర ప్రియంగ తన రాజీనామాను ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారని, దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రంగసామి తెలిపారు.


నెడుంకాడు నుంచి ఏఐఎన్ఆర్‌సీ టికెట్‌పై ఎమ్మెల్యే అయిన ప్రియాంగ 2021లో రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఫలితంగా 40 సంవత్సరాల తర్వాత ఈ కేంద్రపాలిత ప్రాంతానికి మంత్రి అయిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. ప్రజల మద్దతుతోనే తాను అసెంబ్లీకి చేరుకున్నానని, అయితే కుట్ర రాజకీయాలను అధిగమించడం అంత సులువు కాదని గ్రహించానని ప్రియాంగ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తాను కులతత్వం, లింగ వివక్షకు గురైనట్లు లేఖలో తెలిపారు. త్వరలో సవివరమైన నివేదికను అందజేస్తానని చండీర ప్రియంగ తెలిపారు. తాను రాజీనామా చేసిన తర్వాత ఖాళీగా ఉన్న మంత్రి పదవికి వన్నియార్, దళిత లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మాత్రమే నియమించాలని ముఖ్యమంత్రి రంగస్వామిని ఆమె అభ్యర్థించారు. ధనబలం ఆధారంగా మంత్రి పదవికి సిద్ధపడే ఏ ఎమ్మెల్యేనైనా తన వారసులుగా చేయకూడదని, అది వన్నియార్ లేదా దళిత వర్గాలకు అన్యాయం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. తాను మంత్రిగా చూస్తున్న శాఖల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు, సంస్కరణలు చేశానో త్వరలోనే సమగ్ర నివేదికతో వెల్లడిస్తానని చండీరా ప్రియాంగ తెలిపారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలకు క్షమపణలు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story