Rajasthan Minister: ప్రభుత్వంపైనే విమర్శలు.. మంత్రి బర్తరఫ్‌

Rajasthan Minister: ప్రభుత్వంపైనే విమర్శలు.. మంత్రి బర్తరఫ్‌
రాజస్థాన్‌ సీఎం సంచలన నిర్ణయం... అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మంత్రి బర్తరఫ్‌.... నిజమే మాట్లాడానన్న రాజేంద్ర గుధ

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌(Ashok Gehlot) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళల భద్రత విషయంలో సొంత ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన రాష్ట్ర మంత్రి రాజేంద్రగుధ(Rajendra Singh Gudha)ను బర్తరఫ్‌ చేస్తునట్లు ప్రకటించారు. రాజేంద్ర గుధను బర్తరఫ్‌ చేస్తున్నట్లు సీఎం చేసిన సిఫార్సుకు గవర్నర్‌ వెంటనే ఆమోదం తెలిపారు. రాజేంద్ర గూడా సైనిక్ కళ్యాణ్ , హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మహిళల భద్రత విషయంలో తన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కొన్ని గంటల తర్వాత ఆయనను మంత్రివర్గం‍‍(Rajasthan cabinet) నుంచి తప్పించారు. రాజస్థాన్‌లో మహిళలకు భద్రత కరవైందని శాసనసభ వేదికగా సొంత ప్రభుత్వంపైనే రాజేంద్ర విమర్శలు గుప్పించారు. మహిళలపై వివక్ష రోజురోజుకు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపుర్‌ ఘటనను లేవనెత్తే బదులు.. ముందు మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజేంద్ర వ్యాఖ్యానించారు. దీంతో మంత్రివర్గంలో ఉండి ప్రభుత్వాన్నే ప్రశ్నించడంపై మండిపడ్డ ముఖ్యమంత్రి.. రాజేంద్రను బాధ్యతల నుంచి తప్పించారు.

పదవి నుంచి తొలగించిన తర్వాత అర్ధరాత్రి రాజేంద్ర మీడియాతో మాట్లాడారు. నిజం మాట్లాడినందుకు( speaking the truth) తనపై చర్యలు తీసుకున్నారని అన్నారు. తాను ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతానని, తన మనస్సాక్షిని అనుసరిస్తానని అన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించిన ఉదయపూర్వతి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు రాజేంద్ర ధన్యవాదాలు తెలిపారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల్లో దేశంలోనే రాజస్థాన్ నంబర్ వన్ అని.. ఆ విషయాన్నే తాను చెప్పానని రాజేంద్ర అన్నారు.

బీజేపీ పాలనలో ఆడపిల్లల అపహరణకు వ్యతిరేకంగా తమ పార్టీ నిరసన తెలిపిందని, కానీ ఇప్పుడు మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మరోసారి ఆరోపించారు. మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటన సిగ్గుచేటని, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని, అలాగే మనల్ని మనం ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజేంద్ర రాజస్థాన్‌ ప్రభుత్వానికి సూచించారు.

మహిళల సమస్యలను పరిష్కరించకుంటే నాలుగు నెలల తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలను ఎలా ఓట్లు అడుగుతామని రాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో జరుగుతున్న పేపర్‌లీక్‌ల వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గత రెండు నెలల్లో 30 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. యువకులు నిరాశతో జీవిస్తున్నారని, వారికోసం తాము ఏమీ చేయలేమని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story