Centrel Govt.New Bill: ఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐ తొలగింపు

Centrel Govt.New Bill:  ఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐ తొలగింపు
రాజ్యసభలలో బిల్‌ని ప్రవేశపెట్టనున్న కేంద్రం.

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టంతో నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ లో ప్రధానమంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు సభ్యులుగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు CEC, EC ల నియామకాలు, సర్వీసుల కండీషన్లు, పదవీకాలం బిల్లు- 2023ను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం లిస్ట్ చేసింది.

ఎన్నికల సంఘంలో నియామకాలను త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ ప్యానెల్ కు ప్రధాని నేతృత్వం వహిస్తారని బిల్లులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, లోక్ సభలో ప్రతిపక్ష నేత ఉండాలని మార్చిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుకు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది.

ఈ కొత్త బిల్ ప్రకారం...ప్రధాని సూచనల మేరకు ఐదుగురు సభ్యులు ప్యానెల్‌లో ఉంటారు. వారిలో క్యాబినెట్ సెక్రటరీతో పాటు మరో ఇద్దరు సెక్రటరీలుంటారు. ఇప్పటికే న్యాయవ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు ఉన్నాయి.ఇలాంటి సమయంలో కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్ ఆ దూరాన్ని మరింత పెంచుతుంది.ఈ బిల్‌పై ఇప్పటికే ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపైనే నమ్మకం లేదని విమర్శిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story