Samajwadi Party: స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ విప్ రాజీనామా..

Samajwadi Party: స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ విప్ రాజీనామా..
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేళ అఖిలేశ్‌కు జ‌ల‌క్‌

యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. క్రాస్‌ఓటింగ్‌ జరుగుతుందన్న అనుమానాలు నెలకొన్న క్రమంలో అసెంబ్లీలో చీఫ్‌ విప్‌ మనోజ్‌కుమార్‌ పాండే ఆయన పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఇచ్చిన విందుకు హాజరుకాని 8 మంది ఎమ్మెల్యేల జాబితాలో మనోజ్‌కుమార్‌ కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో యోగీ ప్రభుత్వం 8మంది అభ్యర్థులను రంగంలో నిలిపింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున సీనియర్‌ నటి జయాబచ్చన్‌, విశ్రాంత IAS అధికారి అలోక్‌ రంజన్‌, దళిత నేత రాంజీలాల్‌ సుమన్‌ బరిలో ఉన్నారు. భాజపాకు ఏడుగురు అభ్యర్థుల గెలుపునకు మాత్రమే సరిపోయే సంఖ్యాబలం ఉండగా.. ఎనిమిదో అభ్యర్థిని పోటీకి దించటంతో...క్రాస్‌ ఓటింగ్‌ ప్రచారం మొదలైంది. ఎస్పీకి చెందిన 10మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నట్లు కమలనాథులు తెలిపారు. ఈ క్రమంలోనే మనోజ్‌పాండే రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌నోజ్ పాండే త‌న రాజీనామా గురించి అఖిలేశ్‌కు లేఖ రాశారు. మీరు న‌న్ను యూపీ అసెంబ్లీ కోసం చీఫ్ విప్‌గా నియ‌మించారు. ఆ పోస్టుకు నేను రిజైన్ చేస్తున్నాను, దాన్ని మీరు ఆమోదించాల‌ని మ‌నోజ్ త‌న లేఖ‌లో కోరారు. రాయ్‌బ‌రేలీలోని ఉంచ‌హార్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌నోజ్ పాండే ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌త అఖిలేశ్ స‌ర్కారులో ఆయ‌న మంత్రిగా చేశారు.సోమ‌వారం జ‌రిగిన ఎస్పీ మీటింగ్‌కు.. ఆ పార్టీకే చెందిన 8 మంది నేత‌లు హాజ‌రుకాలేదు. మ‌నోజ్‌తో పాటు ముకేశ్ వ‌ర్మ‌, మ‌హారాజి ప్ర‌జాప‌తి, పూజా పాల్‌, రాకేశ్ పాండే, వినోద్ చ‌తుర్వేది, రాకేశ్ ప్ర‌తాప్ సింగ్, అభ‌య్ సింగ్ ఆ మీటింగ్‌కు వెళ్ల‌లేదు.

మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు కలుగజేసుకోవడంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని వివరించారు. కొందరు బీజేపీ నేతలు రంగంలోకి దిగి, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని అఖిలేశ్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తోందని, ఈ రోజు జరిగిన ఎన్నికతో అది రుజువు అయ్యిందన్నారు. చండీగఢ్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఏం చేసిందో అందరికీ తెలుసని గుర్తుచేశారు.

Tags

Read MoreRead Less
Next Story