Punjab : రోగి కడుపులో రాఖీలు, ఇయర్‌ఫోన్‌లు...

Punjab : రోగి కడుపులో రాఖీలు, ఇయర్‌ఫోన్‌లు...
ఇయర్‌ఫోన్‌లు, స్క్రూలులాంటి 100 వస్తువులను వెలికితీసిన వైద్యులు

పంజాబ్‌లోని మోగాకు చెందిన ఒక 40 ఏళ్ల వ్యక్తి కి ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని కడుపులో ఇయర్‌ఫోన్లు, లాకెట్లు, స్క్రూలు, రాఖీలు వంటి రకరకాల వస్తువులు దర్శనమిచ్చాయి. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఈ వ్యక్తి చాలాకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో వైద్యులను సంప్రదించాడు.

నొప్పితో బాధ పడుతున్న ఓ వ్యక్తి కడుపులో నుంచి వైద్యులు రాఖీలు, ఇయర్‌ఫోన్‌లు, స్క్రూలులాంటి 100 వస్తువులను వెలికితీసిన అరుదైన ఉదంతం పంజాబ్ రాష్ట్రంలోని మోగా పట్టణంలో బయటపడింది. 40 ఏళ్ల ఓ వ్యక్తి వికారంతోపాటు తీవ్ర జ్వరం, కడుపునొప్పి సమస్యతో మోగా పట్టణంలోని మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు. అతని కడుపు నొప్పికి కారణాన్ని తెలుసుకునేందుకు వైద్యులు ఎక్స్ రే స్కాన్ చేశారు. స్కానింగులో అతని కడుపులో పలు లోహ వస్తువులున్నట్లు గుర్తించడంతో షాక్ అయ్యారు.


అనంతరం మూడు గంటలపాటు సుదీర్ఘంగా శస్త్ర చికిత్స చేసి అతని కడుపులో నుంచి ఇయర్‌ఫోన్‌లు, వాషర్లు, నట్స్‌ అండ్‌ బోల్ట్‌లు, వైర్లు, రాఖీలు, లాకెట్లు, బటన్లు, రేపర్లు, సేఫ్టీ పిన్ లాంటి 100 వస్తువులను బయటకు తీశారు. కడుపులో 100 లోహ వస్తువులున్న కేసు మొదటిదని మెడిసిటీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా చెప్పారు. చాలా కాలంపాటు లోహ వస్తువులు రోగి కడుపులో ఉండటం వల్ల పలు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైందని, ఆపరేషన్ చేసి కడుపులోని వస్తువులను తొలగించినా, అతని పరిస్థితి నిలకడగా లేదని డాక్టర్ చెప్పారు. కడుపులో నుంచి తీసిన 100 వస్తువులను చూసిన అతని కుటుంబసభ్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ వస్తువులు ఎప్పుడు మింగాడో తెలియదని, రోగి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని కుటుంబసభ్యులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story