Ayodhya Ram Mandir: అంతా రామమయం

Ayodhya Ram Mandir: అంతా రామమయం
గర్భగుడికి చేరిన రామ్‌ లల్లా..22న ప్రాణ ప్రతిష్ఠ

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కపూట సెలవు దినంగా కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, విద్యాలయాలకు జనవరి 22న మ‌ధ్యాహ్నం రెండున్నర వరకు ఈ సెలవు వర్తిస్తుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రజల మనోభావాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్‌ తెలిపారు. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా రాష్ట్రాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. మరోవైపు రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజున రామ మందిరం, అయోధ్య అలంకరణ కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బంతి పువ్వులను సేకరిస్తున్నారు. ఈ పుష్పాలతో.. "జై శ్రీరామ్" అనే ఆకారంలో దండలు అల్లి అయోధ్యలోని పలుచోట్ల అందంగా అలకరించనున్నట్లు వెల్లడించారు.


అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న సంప్రదాయ ఆచార క్రతువులు 4వ రోజుకు చేరాయి. నేడు పవిత్ర అగ్ని పూజను వేదమంత్రాల మధ్య నిర్వహించనున్నారు. ఆ తర్వాత నవగ్రహాలు, అలాగే.. హవన స్థాపన క్రతువును జరపనున్నట్లు ఆలయ ట్రస్టు ఇప్పటికే తెలిపింది. గురువారం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చిత్రాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జావ్ డేకర్ ట్వీట్ చేశారు. కళ్లకు గంతలు కట్టిన చిన్నారి రామయ్య నల్లరాతి రంగులో దర్శనం ఇచ్చాడు. అటు సరయునది వద్ద హారతి సమర్పణ కార్యక్రమం కనులవిందుగా జరిగింది. సంప్రదాయ ఆచారాల్లో భాగంగా మందిర సమీపంలో దీపం వెలిగించేందుకు ఏర్పాటు చేసిన భారీ మట్టి ప్రమిద సిద్ధమైంది. 300 అడుగులు ఉన్న ఆ ప్రమిదలో నింపేందుకు క్యాన్ల కొద్దీ నూనెను తరలించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రారంభోత్సవం అనంతరం భక్తుల బస కోసం ఇప్పటికే తీర్థ క్షేత్రపురం లేదా టెంట్ సిటీని సిద్ధం చేసిన మందిర ట్రస్టు.. ఆశ్రయస్థల్ నూ అందుబాటులోకి తెచ్చింది. భక్తులకు అవసరమైన అన్ని వసతులు ఇక్కడ సిద్ధం చేశారు. అటు.. ఇప్పటికే భద్రతావలయంలోకి చేరుకున్న అయోధ్యలో తుదిదశ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహదారులపై ఎక్కడికక్కడ టైర్ కిల్లర్ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story