LS Polls 2024: పశ్చిమ బెంగాల్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

LS Polls 2024: పశ్చిమ బెంగాల్‌లో ఘనంగా  శ్రీరామనవమి వేడుకలు
మతపరమైన ఘర్షణలు సృష్టించేందుకే అంటున్న తృణమూల్ కాంగ్రెస్‌

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ ప్రతిపక్ష భాజపాకు మధ్య కొత్త రణరంగం సిద్ధమైంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత జరగనున్న తొలి శ్రీరామనవమిని పెద్ద ఎత్తున నిర్వహించాలని భాజపా భావిస్తోంది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీగా ర్యాలీలు చేపట్టి హిందూ ఐక్యతను చాటాలని చూస్తోంది. అయితే మతపరమైన ఘర్షణలు సృష్టించేందుకే భాజపా ఈ వేడుకల్ని నిర్వహిస్తోందని TMC ఆరోపిస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామనవమి వేడుకలు రాజకీయ యుద్ధ భూమిగా మారనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 17న పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా భారీగా ర్యాలీలు నిర్వహించాలని భాజపా భావిస్తోంది. హిందూ ఐక్యతను చాటిచెప్పేందుకే ఈ ర్యాలీలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. అయోధ్య రామ మందిరం ప్రారంభం తర్వాత జరగనున్న వేడుక కావడంతో...భాజపా దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో భాజపా-RSS ప్రభావం పెరగడంతో గతంలో కొన్ని ప్రాంతాలే పరిమితమైన శ్రీరామనవమి గత దశాబ్దంలో బాగా విస్తరించింది. విశ్వ హిందూ పరిషత్-VHP ఏప్రిల్ 9 నుంచి విస్తృతమైన రామ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి ఏప్రిల్ 23న హనుమాన్ జయంతితో ముగియనున్నాయి. ఏప్రిల్ 17న రామ నవమి రోజున పశ్చిమ బెంగాల్‌లోని అన్ని గ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో కార్యక్రమాలు లేదా ర్యాలీలు నిర్వహించనున్నట్టు VHP జాతీయ సహాయ కార్యదర్శి సచీంద్రనాథ్‌ సింఘా తెలిపారు. బెంగాల్ వ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ర్యాలీల్లో ఎవరూ ఆయుధాలు ప్రదర్శించరనీ వలం సంప్రదాయ అఖాడాలు మాత్రమే వాటిని ప్రదర్శిస్తారని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో రామనవమి ర్యాలీల సందర్భంగా 2017, 2018, 2023లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఇవి అధికార TMC ప్రతిపక్ష భాజపా మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. హింసను ప్రేరేపించింది మీరంటే మీరని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

మరోవైపు రామనమవి వేళ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని భాజపా భావిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల్లో ల‌బ్ధి పొందాలని వేడుకల రూపంలో భాజపా వేస్తున్న ఉచ్చు అనీ అందులో ఎవరూ పడొద్దని ప్రజలకు సూచించారు. భాజపాకు దీటుగా తృణమూల్‌ కాంగ్రెస్ కూడా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ర్యాలీలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు శ్రీరామ నవమికి సెలవు లేని పశ్చిమ బెంగాల్‌లో.... తొలిసారి మమతా సర్కార్‌ సెలవివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2016కు ముందు వరకు, బెంగాల్‌లో రామ నవమిని విస్తృతంగా జరుపుకోలేదు. అక్కడ ఎక్కువగా దుర్గా పూజను నిర్వహిస్తారు. అయితే, 2016 నుంచి పశ్చిమ బెంగాల్‌లో భాజపా పుంజుకోవడంతో శ్రీరామనవమి ఊపందుకుంది.

పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో ఈ సారి 25 సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా......హిందూలను ఏకీకరణ చేస్తే అది సాధ్యమని భావిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 18 సీట్లు సాధించింది. TMC 22 చోట్ల ,కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందాయి. బెంగాల్‌లో ఏప్రిల్ 19న మొదలు కానున్న లోక్‌సభ ఎన్నికలు జూన్‌ 1న చివరి విడతలో ముగియనున్నాయి

Tags

Read MoreRead Less
Next Story