Ayodhya: రామ్ లల్లా కాదు ఇకపై బాలక్ రామ్

Ayodhya: రామ్ లల్లా కాదు ఇకపై  బాలక్ రామ్
అయోధ్య బాల రాముడి పేరు మార్పు

రామ్‌లల్లాగా పేరుగాంచిన అయోధ్యలో కొలువైన రామయ్యను ఇకపై బాలక్‌ రామ్‌గా పిలవనున్నట్లు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఓ పూజారి తెలిపారు. రాముడి విగ్రహం ఐదేళ్ల పిల్లాడి రూపంలో మనోహరంగా ఉండటంతో బాలక్ రామ్‌గా పిలవాలని తాము నిర్ణయించినట్టు తెలిపారు. మరోవైపు బాలరాముడి విగ్రహం తయారీ వెనకున్న ఆసక్తికర విషయాన్ని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. విగ్రహ రూపకల్పనలో వాడిన శిల 3 వందల కోట్ల ఏళ్ల క్రితం నాటిదని తెలిపింది.

అయోధ్యలో కొలువుదీరిన రాముడికి మరో పేరు ప్రాచుర్యంలోకి రానుంది. రామ్‌ లల్లాగా పిలుస్తున్న రామయ్యను ఇప్పటి నుంచి "బాలక్‌ రామ్‌" గా కూడా పిలవనున్నారు. నిలబడి ఉన్న రాముడి విగ్రహం ఐదేళ్ల పిల్లాడి రూపంలో ఉండటంతో "బాలక్‌ రామ్‌గా" ఆయన్ను పిలవనున్నట్టు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగమైన అరుణ‌్ దీక్షిత్ అనే పూజారి తెలిపారు. తాను ఇప్పటి వరకు 50 నుంచి 60 విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్నాననీ వాటన్నింటిలో ఇదే అద్భుతంగా అనిపించిందని పేర్కొన్నారు .


ప్రాణ ప్రతిష్ఠ జరిగిన బాలరాముడి విగ్రహాన్ని బనారసీ ఫాబ్రిక్‌లో అలంకరించారు. విగ్రహానికి పసుపు ధోతీ, ఎరుపు రంగు అంగవస్త్రాన్ని తొడిగారు. ఈ అంగవస్త్రాన్ని స్వచ్ఛమైన బంగారు 'జరీ' దారాలతో అలంకరించారు. ఇందులో శుభప్రదమైన వైష్ణవ చిహ్నాలైన 'శంఖం', 'పద్మ', 'చక్రం' 'మయూరం' ఉన్నాయి. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల ఈ బాల రాముడి విగ్రహం మూడు వందల కోట్ల ఏళ్ల క్రితం నాటి రాయి నుంచి తయారు చేసిందని తెలుస్తోంది.మైసూరులోని జయపుర హోబ్లీలో ఓ రైతు పొలంలో ఈ రాతికి సంబంధించిన శిల దొరికింది. విగ్రహాల తయారీలో ఈ శిల అనువుగా ఉండటంతో దీ‌న్ని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు అయోధ్యలో కొలువు దీరిన బాలరాముడి ఆభరణాలపై కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆభరణాల రూపకల్పన ఏదో సాధారణంగా జరగలేదనీ....దాని వెనక చాలా అధ్యయనం జరిగిందని పేర్కొంది. అందులో భాగంగా అధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరితమానస్, ఆళవందర్ స్త్రోత్రం వంటి గ్రంథాలను విస్తృతంగా పరిశోధించినట్టు తెలిపింది. వీటిని అధ్యయనం చేసి ఆభరణాలను తయారు చేయించినట్టు వివరించింది. అయోధ్యలో సోమవారం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా ప్రధాని చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ వేడుకకు 7 వేలకు పైగా ప్రముఖులు హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story