UP Robbery: గార్డును చంపి ఏటీఎం చోరీ..

UP Robbery: గార్డును చంపి ఏటీఎం చోరీ..
సీసీటీవీలో నమోదైన దొంగతనం దృశ్యాలు

ఉత్తర్‌ప్రదేశ్‌ లో సినిమా రేంజ్ దొంగతనం జరిగింది.ఏటీఎం లో డబ్బులు నింపేందుకు వచ్చిందా బ్యాంక్ సిబ్బందిపై ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు.. అదే సమయంలో ఇంకోవ్యక్తి వ్యాన్ లోని డబ్బు తీసుకుని పరారాయ్యాడు.

మీర్జాపూర్‌ లో స్థానికంగా ఉన్న ఓ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు బ్యాంకు సిబ్బంది ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ఒక సెక్యురిటీ గార్డ్, ఇద్దరు క్యాషియర్లు డబ్బుతో ఉన్న వాహనంలో అక్కడికి వచ్చారు. సరిగ్గా డబ్బు ఉన్న వ్యాన్‌ను ఏటీఎం ముందు ఉంచి.. అందులో నుంచి డబ్బు పెట్టెలను బయటికి తీసే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడే హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఓ వ్యక్తి తుపాకీ తో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపాడు. అనంతరం మరో వ్యక్తి వచ్చి ఆ వ్యాన్‌లో ఉన్న డబ్బు పెట్టెను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అందులో రూ.39 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.


దుండగుడి కాల్పులతో బెదిరిపోయిన బ్యాంకు సిబ్బంది భయంతో వ్యాన్‌లోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే నడిరోడ్డుపై పట్టపగలు ఇంత దారుణం జరిగినా చాలా మంది తమకు ఏదీ పట్టనట్లు వెళ్లిపోయారు. ఇంతలో సైకిల్‌ మీద వెళ్తున్న ఓ స్టూడెంట్ వచ్చి కాల్పుల కారణంగా కుప్పకూలిపోయిన సెక్యూరిటీ గార్డును.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ పూర్తి ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆ సెక్యూరిటీ గార్డు చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురు వ్యక్తులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం స్పెషల్ టీమ్‌లు గాలింపు చేపట్టాయి. దుండగులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే ఏటీఎం నింపేందుకు వచ్చిన బ్యాంకు సిబ్బంది నుంచి డబ్బులు కాజేయాలని అక్కడ వేచి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story