SANATHANA ROW: మాది "సర్వ ధర్మ సంభవ్‌" విధానం: కాంగ్రెస్‌

SANATHANA ROW: మాది సర్వ ధర్మ సంభవ్‌ విధానం: కాంగ్రెస్‌
సనాతన వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదన్న కాంగ్రెస్‌... ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్న సీఎం స్టాలిన్‌

సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్, A.రాజా వ్యాఖ్యలతో తాము ఏకీభవించడంలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అన్ని మతాలను గౌరవించాలనే సర్వధర్మ సంభవ్ విధానాన్నే తాము నమ్ముతామని హస్తం పార్టీ తెలిపింది. విపక్ష కూటమి ఇండియాలో ప్రతి పార్టీ అన్ని మతాలు, కులాలు, విశ్వాసాలను గౌరవిస్తుందని పేర్కొంది. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను పరిశీలిస్తే తమ విధానం అర్థమవుతుందని కాంగ్రెస్ పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేరా తెలిపారు. ఇదే విషయాన్ని మిత్రపక్షం డీఎంకే వద్ద ప్రస్తావిస్తారా అని అడగ్గా అలాంటి అవసరం లేదని ఖేరా చెప్పారు. విపక్ష కూటమి ఇండియాలో ప్రతి ఒక్కరూఅన్ని మతాలను గౌరవిస్తారని తెలిపారు. ఎవరి వ్యాఖ్యలనైనా వక్రీకరించాలని అనుకుంటే స్వేచ్చగా చేసుకోవచ్చన్నారు. అలాంటి వ్యాఖ్యలను వక్రీకరించాలని ప్రధాని అనుకుంటే చేసుకోవచ్చని ఖేరా సూచించారు.


ఉదయనిధి స్టాలిన్‌ సనాతనను డెంగ్యూ, మలేరియాతో పోల్చడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. డీఎంకేలో D అంటే డెంగ్యూ, M అంటే మలేరియా, K అంటే దోమ అన్న అన్నామలై ఆ పార్టీని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం చేపట్టిన ఐదేళ్లలో తొలి ఏడాది సనాతనను వ్యతిరేకించారని, రెండో ఏడాది సనాతనను రద్దు చేయాలన్నారనీ మూడో ఏడాది నిర్మూలించాలని అంటున్నారని వ్యాఖ్యానించారు. 4-5 ఏడాదిల్లో మళ్లీ తాము హిందువులమే అని చెప్పుకుంటారనీ దశాబ్ధాలుగా డీఎంకే ఇదే చేస్తుందని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు వారు అమర్ , అక్బర్ , ఆంథోనీలాగా అవతారం ఎత్తుతారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదే వ్యూహంతో 17 ఏళ్లుగా అపజయం పాలవుతున్నారని పేర్కొన్నారు.


మరోవైపు సనాతన ధర్మంపై తన కుమారుడు, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తమిళనాడు సీఎం MK స్టాలిన్ సమర్థించారు. సనాతన ధర్మంలో ఉన్న అమానవీయ విధానాలపైనే ఉదయనిధి మాట్లాడారని చెప్పారు. నిరాశలో ఉన్న భాజపా విపక్ష కూటమి ఇండియాలో విభేదాలు తీసుకురావాలని యత్నిస్తోందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. సనానత ధర్మంలో ఉన్నవారిని అంతం చేయాలనే పదం ఉదయనిధి ఎక్కడా వాడలేదనిఅన్నారు. కావాలనే భాజపా అనుకూల శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని..స్టాలిన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన MK స్టాలిన్ ఉదయ్ ను లక్ష్యంగా చేసుకునేవారి జాబితాలో ప్రధాని నరేంద్రమోదీ కూడా చేరడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అణచివేత విధానాలకు వ్యతిరేకంగానే ఉదయనిధి వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు.ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై వివక్ష చూపుతున్న సనాతన విధానాలనే ఉదయనిధి వ్యతిరేకించారని సీఎం స్టాలిన్ వివరించారు. అంతేకానీ.. ఏ మతాన్ని, మత విశ్వాసాలను కించపరచలేదన్నారు. ఉత్తరాదిన భాజపా పెంచి పోషిస్తున్న కొందరు సామాజిక మాధ్యమాల్లో ఉదయనిధి వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story