Scrub Typhus : భయపెడుతున్న స్క్రబ్ టైఫస్

Scrub Typhus : భయపెడుతున్న స్క్రబ్ టైఫస్
ఏడుగురు , 180కి పెరిగిన కేసుల సంఖ్య

కేరళలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తుంటే.. ఒడిశాను ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి వణికిస్తోంది. రోజురోజుకి రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క ఆదివారం రోజే సుందర్‌గఢ్ జిల్లాలో కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. దీంతో.. జిల్లాలో ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 180కి చేరుకుందని ఆరోగ్య అధికారి తెలిపారు. 59శాంపిల్స్ ను టెస్ట్ చేయగా 11 మందికి స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎవరికైనా 4 లేదా 5 రోజులు పాటు జ్వరం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.


ఆదివారం మొత్తం 59 శాంపిల్స్‌ని పరీక్షల కోసం పంపగా.. అందులో 11 మందికి స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌గా తేలిండి. ఈ వ్యాధి సోకిన 180 మందిలో.. 10 మంది ఇతర రాష్ట్రాలకు, మరో 9 మంది ఇతర జిల్లాలకు, మిగిలిన వారంతా సుందర్‌గఢ్ జిల్లాకు చెందిన వారని జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో నాలుగు లేదా ఐదు రోజుల పాటు జ్వరం కొనసాగితే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి, సుందర్‌ఘర్ జిల్లా ఆరోగ్య కేంద్రంతో పాటు పలుచోట్ల ఉచితంగా పరీక్షలు చేస్తున్నామని, అక్కడ టెస్ట్ చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి ప్రజలకు సూచించారు. ఒడిశాలో స్క్రబ్ టైఫస్‌ వ్యాధి ధాటికి ఇప్పటి వరకు ఏడుగురు వ్యక్తులు చనిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ఒడిశా హెల్త్ డిపార్ట్‌మెంట్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్క్రబ్ టైఫస్‌ వ్యాధి గురించి అధ్యయనం చేసేందుకు వీర్‌ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (వీఐఎంఎస్‌ఏఆర్‌) నుంచి ముగ్గురు నిపుణులను బర్గఢ్‌ జిల్లాకు పంపించింది. వ్యాధి సోకిన వారిలో ఉన్న లక్షణాలు పరిశీలించి.. వారికి ఆ వ్యాధి ఎలా సోకింది.. దాని పర్యవసాలు ఏంటి అనేది ఈ నిపుణుల బృందం పర్యవేక్షించనుంది.

ఇంతకీ ఈ వ్యాధి ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..

సాధారణంగా పొలాలు, అటవీ ప్రాంతాల్లో పని చేసేవారికి స్క్రబ్ టైఫస్ సోకుతుంది. ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడంతో శరీరంపై ఎస్చర్ అనే మచ్చ పుడుతుంది.ఈ కీటకాలు కుట్టిన చోట చర్మకణాలు చనిపోతాయి. అధిక జ్వరం, పొడి దగ్గు, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, ఎరుపు కళ్ళు, ఎరుపు మచ్చలు లేదా శరీరంపై దద్దుర్లు, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి . ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story